బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 30, 2020 , 23:22:23

కందిరైతులు ఆందోళన చెందొద్దు

కందిరైతులు ఆందోళన చెందొద్దు

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : కంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతు నుంచి 5 క్వింటాళ్ల కంది పంటను కొనుగోలు చేపట్టే దిశగా మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి నియోజకవర్గ కందిరైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది కంది పంట ఆశాజనకంగా ఉందని, ఎకరాకు 4నుంచి 5 క్వింటాళ్ల పంట చేతికొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కొడంగల్‌ మార్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటైన కొనుగోలు కేంద్రంలో ఎకరాకు రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేపడుతున్నారని, కాబట్టి రైతులు మిగతా పంట అమ్మకంపై ఆందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబితాలో చాలా వరకు రైతుల పేర్లు గల్లంతు కావడంతో పంట పండించుకున్న రైతులు కంది అమ్మకాలను చేపట్టుకోలేక పోతున్నారని తెలిపారు.


కాబట్టి రైతు సమ్యలను దృష్టిలో పెట్టుకొని ఎకరాకు 5క్వింటాళ్లతోపాటు జాబితాతో సంబంధం లేకుండా పంట కొనుగోళ్లను చేపట్టాలని మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. దీంతో మంత్రి స్పందించి జాబితాతో సంబంధం లేకుండా పండించిన ప్రతి రైతు నుంచి ఎకరాకు 5 క్వింటాళ్లు కొనుగోళ్లు చేపట్టే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, శ్యాసం రామకృష్ణ, రాములునాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo