గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 30, 2020 , 23:21:52

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

దౌల్తాబాద్‌ : గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ మీషన్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్మించేందుకు తీసుకున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని డీఆర్‌డీవో ఇన్‌చార్జి పీడీ కృష్ణ అన్నారు. గురువారం దౌల్తాబాద్‌ మండలంలోని గుముడాల, మాటూరు గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, హరితహారం పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సూచించారు. సిబ్బంది నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతి వారం మొక్కలకు నీరు పోయించాలన్నారు. ప్రతి ఇంటికి ఓ ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఆయ గ్రామాల ప్రజలకు సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేంధించాలని ప్లాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని, శ్మశానవాటిక పనులను వేగవంతం చేయాలన్నారు. చేత్త సేకరణలో విధులు నిర్వహించే గ్రామ పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తపై ప్రజలకు పూర్తిస్థాయి అవగహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛత పాటించాలని సూచించారు. 


మండలంలోని పలు గ్రామాల్లో కొంత మంది కాంట్రాక్టర్లు మరుగుదొడ్లు నిర్మిస్తామని గ్రామ పంచాయతీల్లో అడ్వన్స్‌గా డబ్బు తీసుకుని పనులు చేయకుండా వదిలి వెళ్లిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులకు మంజూరైన నిధులను స్వాహా చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు వారనికి ఒక్కసారి నీరు పోయించాలని ఉపాధిహామీ సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని, రైతులకు అవసరమయ్యే పనులను చేపట్టాలని, భూగర్భ జలాలు పెంపొందించేందుకు పనులు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఈసీ మోతీలాల్‌నాయక్‌, ఏపీవో దస్తయ్య, టెక్నికల్‌ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo