శుక్రవారం 29 మే 2020
Vikarabad - Jan 30, 2020 , 00:03:09

కాగ్నానదిలో..కర్ణాటకు దొంగలు

కాగ్నానదిలో..కర్ణాటకు దొంగలు
  • జిల్లా సరిహద్దులోని కాగ్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
  • సరిహద్దులు దాటి ఇసుక తవ్వకాలు జరుపుతున్న వైనం
  • గతేడాది హద్దులను గుర్తించిన ఇరు రాష్ర్టాల అధికారులు
  • తాజాగా ఒక్కరోజులోనే రాత్రికి రాత్రే 400-500 ట్రాక్టర్ల ఇసుక మాయం
  • స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు
  • ప్రతి ఏటా కొత్త హద్దులను సృష్టిస్తున్న కర్ణాటక అధికార యంత్రాంగం
  • రెండేండ్లుగా 2లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తరలింపు
  • మరోసారి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమైన జిల్లా యంత్రాంగం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాగ్నా నదిలో కర్ణాటక దొంగలు పడ్డారు.  జిల్లాకు పక్కనే ఉన్న పొరుగు రాష్ర్టానికి చెందిన అధికారులు  సరిహద్దులు దాటి జిల్లా పరిధిలోని కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దు సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి ఏటా కొత్త సరిహద్దులను సృష్టిస్తూ పొరుగు రాష్ట్ర రెవెన్యూ అధికారులు హద్దులు దాటుతున్నారు. బషీరాబాద్‌ మండలం క్యాద్గిర శివారులోని కాగ్నానదిలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గతంలో ఇసుక తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కయ్యానికి కాలుదువ్వి రాష్ట్ర భూభాగాన్ని తమ భూభాగమంటూ దబాయించి ఇసుకను తరలించారు. మూడేండ్ల క్రితం ఇరు రాష్ర్టాల మంత్రుల సమక్షంలో సూచించుకున్న హద్దులను మరిచి తెలంగాణ భూభాగంలోకి చొరబడి కొత్త హద్దులను సృష్టించారు కన్నడ రెవెన్యూ అధికారులు. ఈ విషయమై గతేడాది అప్పటి కలెక్టర్‌ ఓమర్‌ జలీల్‌, సేడం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి మరోసారి వివాదం తలెత్తకుండా ఇరు రాష్ర్టాల అధికారుల సమక్షంలో సరిహద్దులను గుర్తించారు. ప్రస్తుతం ఆ సరిహద్దులను సైతం దాటి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక తరలింపులో స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాత్రికి రాత్రే 400 నుంచి 500ట్రాక్టర్ల ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు సమాచారం. ఇప్పటికైనా ఇసుక అక్రమ తరలింపునకు కళ్లెం వేయకపోతే జిల్లా పరిధిలోని కాగ్నా నది ఖాళీ కావడం ఖాయం.


తెలంగాణ-కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి ఏటా కొత్త సరిహద్దులను సృష్టిస్తూ హద్దు దాటుతున్న కర్ణాటక ప్రభుత్వం తాజాగా మరోసారి సరిహద్దు దాటి ఇసుక దోపిడీకి పాల్పడింది. బషీరాబాద్‌ మండలం క్యాద్గిర శివారులోని కాగ్నా నదిలో అంతరాష్ట్ర సరిహద్దు విషయంలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కర్ణాటక ప్రభుత్వం హద్దులు మీరి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంది. గతంలోనూ సరిహద్దు వద్ద ఇసుక తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కయ్యానికి కాలుదువ్వి, రాష్ట్ర భూభాగాన్ని తమ భూభాగమేనంటూ దబాయింపునకు దిగిన కర్ణాటక ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కాగ్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుంది. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇరు రాష్ర్టాల మంత్రుల సమక్షంలో సూచించుకున్న హద్దులను మరిచి తెలంగాణ రాష్ట్ర భూభాగంలోకి చొరబడి కొత్త హద్దులను సృష్టించారు కన్నడ రెవెన్యూ అధికారులు. తదనంతరం గతేడాది అప్పటి జిల్లా కలెక్టర్‌ ఓమర్‌ జలీల్‌, సేడం జిల్లా కలెక్టర్‌తో సరిహద్దు విషయమై మాట్లాడి మరోసారి వివాదం తలెత్తకుండా ఇరు రాష్ర్టాల అధికారుల సమక్షంలో సరిహద్దును గుర్తించారు. అయితే ప్రస్తుతం గతేడాది గుర్తించిన సరిహద్దును సైతం పక్కనబెట్టి అక్రమంగా రాష్ట్ర సరిహద్దులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కర్ణాటక అక్రమంగా ఇసుక తరలింపులో స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఎంతో కొంత డబ్బులిచ్చి కర్ణాటక మన సరిహద్దులోని ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నట్లు స్థానికంగా ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ప్రతి ఏటా మన భూభాగం నుంచి అక్రమంగా ఇసుకను తరలించుకుపోతున్న కర్ణాటక ప్రభుత్వానికి కళ్లెం వేయకపోయినట్లయితే కాగ్నా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. 


కన్నడీల దోపిడీ...

తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కాగ్నా నదిలో కన్నడీలు హద్దు మీరి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గత మూడేండ్లుగా క్యాద్గిర-పోతంగల్‌ గ్రామాల మధ్య గల కాగ్నా నది భూభాగంలో కర్ణాటకకు సంబంధించిన హద్దు వరకు ఇసుక తవ్వకాలను పూర్తి చేసిన కన్నడీలు దొంగ లెక్కలతో తెలంగాణ భూభాగంలోని ఇసుకను తరలించే పనిలో పడ్డారు. మన రాష్ర్టానికి చెందిన సరిహద్దున గల రెవెన్యూ అధికారులు ఆ వైపు దృష్టి పెట్టకపోవడమే ఈ అక్రమ ఇసుక తరలింపునకు కారణంగా చెబుతున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. మూడేండ్లుగా కాగ్నా నదిలోని కర్ణాటక సరిహద్దుతోపాటు రాష్ర్టానికి సంబంధించిన భూభాగంలోనూ ఇసుకను తరలించారు. అయితే ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ఇసుక తవ్వకాలను జరిపినట్లు తెలిసింది. వారి భూభాగంలోని ఇసుక తవ్వకాలు పూర్తి కావడంతో తెలంగాణ భూభాగంలోని ఇసుకపై కన్నడీలు కన్నేశారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ, పోలీసు అధికారుల అండదండలతో క్యాద్గిర గ్రామం దాటిన అనంతరం కాగ్నా నదిలో గుట్టుచప్పుడు కాకుండా పూర్తిగా తెలంగాణ భూభాగంలోని ఇసుకను రాత్రికి రాత్రి తరలించుకుపోతున్నారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున కాగ్నా నది నుంచి అక్రమంగా కర్ణాటకకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానిక గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు. తాజాగా 400-500 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రాత్రి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. స్థానిక ప్రజలకు సమాచారం అందడంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సమాచారమందించడంతో సోమవారం నుంచి ఇసుక తరలింపు నిలిచిపోయింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోతే ఇప్పటికే చాలా కొరత సమస్యగా మారిన ఇసుక విషయంలో రాష్ర్టానికి నష్టం జరుగనుంది.


ప్రతి ఏటా ఇసుకను తరలిస్తున్న కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా కాగ్నా నదిలోని రాష్ట్ర సరిహద్దు భూభాగం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గతేడాది కూడా బోగస్‌ పత్రాలను సృష్టించి బషీరాబాద్‌ మండలం క్యాద్గిర వద్ద గల కాగ్నా నదిలోని 70 శాతం భూభాగమంతా తమదేనంటే దబాయింపునకు దిగారు. అయితే బషీరాబాద్‌ మండలం క్యాద్గిర గ్రామం-సేడం తాలుకాలోని పోతంగల్‌ గ్రామాల మధ్యలోని కాగ్నా నదిలో భూభాగాన్ని మూడేండ్ల క్రితం సర్వే నిర్వహించి హద్దులను నిర్ణయించడంతో కర్ణాటక భూభాగం వరకు ఆ రాష్ట్ర రెవెన్యూ అధికారులు హద్దులకు గుర్తుగా కర్రాలతో హద్దులను నిర్ణయించారు. అయితే తదనంతరం ఆ హద్దులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లులేకుండా చేసిన సేడం రెవెన్యూ యంత్రాంగం గతేడాది జీపీఎస్‌ సర్వే అంటూ కాగ్నా నదిలో 70 శాతం భూభాగాన్ని ఆక్రమించుకునేందుకుగాను ఏకపక్షంగా కొత్త హద్దులను సృష్టించారు. అయితే బషీరాబాద్‌ మండలంలోని క్యాద్గిర, గంగ్వార్‌ గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వికారాబాద్‌ జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కాగ్నా నది భూభాగంలో కర్ణాటక ప్రభుత్వం హద్దు దాటి రావడంతో ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో ఇరు రాష్ర్టాల రెవెన్యూ, పోలీస్‌ ఉన్నతాధికారులు సరిహద్దు వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించేందకు సరిహద్దు వద్ద సమావేశమై ఉమ్మడి సర్వే నిర్వహించి కాగ్నా నదిలో ఇరు రాష్ర్టాల హద్దులను నిర్ణయించి హద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం గతేడాది ఇరు రాష్ర్టాల అధికార యంత్రాంగం సమక్షంలో ఏర్పాటు చేసిన హద్దులను తుంగలో తొక్కిన కర్నాటక తెలంగాణ భూభాగంలోని ఇసుకను భారీ ఎత్తున తరలిస్తుంది.


logo