శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jan 30, 2020 , 00:00:39

ప్రమాణాలు మెరుగు పడితేనే.. కాయకల్ప పురస్కారం

ప్రమాణాలు మెరుగు పడితేనే.. కాయకల్ప పురస్కారం

తాండూరు టౌన్‌: సర్కారు దవాఖానల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న కాయకల్ప పోటీల్లో గెలిచే దవాఖానలకు రూ. 50 లక్షల నజరానా అందిస్తోందని, అందుకు పోటీ పడుతున్న తాం డూరులోని జిల్లా దవాఖాన ఇంకా మెరుగు పడాల్సిన అవసరముందని కాయకల్ప జిల్లా స్థాయి నాణ్యత ప్రమాణాల అంచనా కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా దవాఖాన ఆర్‌ఎంఓ డి. శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం తమ బృందంతో కలిసి దవాఖానను సందర్శించి.. పలు వార్డులను పరిశీలించారు. దవాఖానలోని నవజాత శిశు కేంద్రం, చిన్నారుల వార్డు, ప్రసూతి విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌ వంటి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం దవాఖాన నిర్వహణపై సూపరింటెండెంట్‌ డా.మల్లికార్జున్‌తో పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దవాఖానలో ప్రమాణాల నిర్వహణ, పారిశుధ్యం, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, బయో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, హైజీన్‌ ప్రమోషన్స్‌, సపోర్ట్‌ సర్వీసెస్‌, దవాఖాన పరిసరాల నిర్వహణ వంటి 7 అంశాలపై తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆయా విభాగాల్లో నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పనితీరుపై ఆరా తీయడం జరిగిందన్నారు. అన్ని అంశాల్లో జిల్లా దవాఖాన ప్రమాణాలను మెరుగు పరుచుకునేందుకు పలు సలహాలు, సూచనలు అందించడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న కాయకల్ప పోటీలో పాలుపంచుకునేందుకు జిల్లా దవాఖానకు అర్హతలు ఉన్నాయన్నారు. దవాఖానల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు నిర్వహిస్తున్న కాయకల్ప పోటీలో గెలిచే దవాఖానకు రూ. 50 లక్షల  నగదు పురస్కారం అందుతుందని, రన్నరప్‌గా నిలిచిన ఆసుపత్రికి రూ. 30 లక్షలు, మిగతా మూడు దవాఖానలకు కన్సలేషన్‌ కింద రూ. 3లక్షల నగదును అందిస్తారని వివరించారు. 


బుధవారం జరిపిన సర్వేను రాష్ట్ర స్థాయి బృందానికి అందిస్తామని తెలిపారు. మొత్తానికి కాయకల్ప పోటీలో గెలిచేందుకు తాండూరు జిల్లా దవాఖాన మెరుగు పడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా దవాఖానను సందర్శించిన బృందంలో ఖమ్మం దవాఖాన క్వాలిటీ కంట్రోలర్‌ ఉపేందర్‌, ఆరోగ్య శ్రీ ప్రతినిధి వినయ్‌, స్థానిక జిల్లా దవాఖాన ఆర్‌ఎంఓలు డా.యాదయ్య, డా.ఆనంద్‌ గోపాల్‌రెడ్డి, సీనియర్‌ వైద్యులు జయప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు. 


logo