గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 02:19:40

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
  • - ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి
  • - జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్పీ నారాయణ

వికారాబాద్‌ రూరల్‌ : రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని  తెలంగాణ చౌరస్తాలో ఎస్పీ సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడారు. వాహనదారులు వారి వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహన దారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు. త్రిఫుల్‌ రైడింగ్‌ చేయకూడదన్నారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు  పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని  డ్రైవర్లకు సూచించారు.   ఫోర్‌ వీలర్‌లో వెళ్లే వారు సీట్‌బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. అతివేగంతో కాకుండా రోడ్డు నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాలకు చేరుకోవాలన్నారు. అతివేగంగా వెళ్లడం ద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నిదానంగా ప్రయాణిస్తూ తమ పై ఆధారపడ్డ కుటుంబాలను రోడ్డు పాలు చేయకూడదన్నారు.


కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇంధనాన్ని వృథాచేయకూడదని, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. చిన్న చిన్న పనులు ఉంటే కాలి నడకన వెళ్లి పనులు చేసుకుంటే  ఆరోగ్యం పెరిగి, కాలుష్యం, ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోరాదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా  తెలంగాణ చౌరస్తాలో రోడ్డు నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపిన వారికి సినిమా టికెట్లను బహుకరించి వారిని ఉత్సాహపరిచారు. నియమాలు పాటించని వారికి గాంధీజీ మార్గంలో మొదటి సారి గులాబీ పువ్వులిచ్చి శాంతియుతంగా  అవగాహన కల్పించారు. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో మరుపురాని సంఘటనగా గుర్తుండి పోతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రషీద్‌, డీఎస్పీ సంజీవరావు, సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ లక్ష్మయ్య, పోలీసులు  పాల్గొన్నారు. 


ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో ఉచిత ఆరోగ్యవైద్య శిబిరం  

వాహనదారులు ఆరోగ్యంగా ఉంటేనే వాహనాలు నడపాలని  వికారాబాద్‌ ఆర్టీఏ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం 31వ జాతీయ  రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆటో రిక్షా డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లకు మహావీర్‌ దవాఖాన సిబ్బంది సహాయంతో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా  అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.  డ్రైవర్లు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయరాదని, అతి వేగంగా వెళ్లకూడదన్నారు.  ఎదురుగా వచ్చిన వాహనాలకు దారి ఇస్తూ రోడ్డు నియమాలు పాటించాలన్నారు. రాంగ్‌రూట్‌లో వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదన్నారు. రోడ్డు నియమాలు పాటించి తమ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని సూచించారు.  కార్యక్రమంలో మహావీర్‌ దవాఖాన వైద్య సిబ్బంది, ఎంవీఐ కిషోర్‌బాబు, కానిస్టేబుల్‌ రాఘవేందర్‌, జాశ్వ, తదితరులు  పాల్గొన్నారు. 


logo