గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 02:16:56

ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి

ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈ నెల 31 వరకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి వాడుకోవాలని కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవో,ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు అవసరమైన ట్రాక్టర్లను ఈ నెల 31 వరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. పంచాయతీ పరిధిని బట్టి పెద్ద, చిన్న ట్రాక్టర్లను వినియోగించుకోవాలన్నారు. వేసవిలో హారితహారం మొక్కలకు నీరు పోసేందుకు వీలుగా ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయాలని సూచించారు. బ్యాంకర్లు సకాలంలో లోన్‌ మంజూరు చేయకపోతే స్థానిక ప్రైవేట్‌ ఫైనాన్సర్ల ద్వారా లేదా సర్పంచ్‌ల ద్వారా అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అందించిన నిధులతో కొన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగిందని, మిగిలిన గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్న నిధులతో ఈ నెల 31వరకు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా రాబోయే వర్షకాలంలో అవసరమైన మొక్కలు నాటేందుకు వెంటనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. అన్ని నర్సరీలకు ఫెన్సింగ్‌తో పాటు క్యాటిల్‌ గేట్లు అమర్చాలని సూచించారు.  ప్రతి రోజు మొక్కలను పరిశీలిస్తూ చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి, వాటికి ప్రతిరోజు నీరు పోసి కనీసం 85 శాతం మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమం సంవత్సరాంతం నిరంతరంగా కొనసాగాలన్నారు. ఈ వేసవిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌  కింద హరితహారం, ఇంకుడు గుంతల పనులను మాత్రమే చేపట్టాలన్నారు. 


ఉద్యానవన శాఖ అధికారులు అన్ని నర్సరీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మందులను మొక్కలకు అందించాలన్నారు. ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఈత వనాలను రైతులు పొలం గట్లపై చెరువు, కుంటల గట్లపై అలాగే ప్రభుత్వ భూముల్లో ఈత, ఖర్జూర మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ మొక్కలను సంరక్షించేందుకు సంరక్షకులను నియమించి ప్రతి రోజూ నీరు పోసి సంరక్షించేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సహకరించాలన్నారు. ప్రతి వారం మొక్కల సంరక్షణపై సంబంధిత సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పాల్గొనాలని సూచించారు. 565 గ్రామ పంచాయతీలలో డంపింగ్‌ యార్డుల పనులు పూర్తయినట్లు కలెక్టర్‌ తెలిపారు. శ్మశాన వాటికలకు సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలలో స్థలాలు కేటాయించలేదని, అలాంటి గ్రామ పంచాయతీలకు వెంటనే స్థలాలు కేటాయించి పనులు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31 వరకు పెండింగ్‌లో ఉన్న అని పనులు ప్రారంభం కావాలని, స్థలం కేటాయింపులో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు.  కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం బహిరంగ మల విసర్జన చేయకూడదని, ఆరోగ్యం గౌరవంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. స్వచ్ఛ భారత్‌ కార్యాక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మరుగుదొడ్లు నిర్మించుకోని వారు వెంటనే నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో మోతీలాల్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో రిజ్వాన, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జీఎం డీఐసీ వినయ్‌కుమార్‌, భూగర్భ జల వనరుల శాఖ అధికారి రామారావు, డీటీడీవో కోటాజీలతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


logo