బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 02:13:39

కేటీఆర్‌ను కలిసిన తాండూరు మున్సిపల్‌ పాలకవర్గం

కేటీఆర్‌ను కలిసిన తాండూరు మున్సిపల్‌ పాలకవర్గం

తాండూరు, నమస్తే తెలంగాణ: ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపతో పాటు కౌన్సిలర్లను అభినందించారు. సీఎం కేసీఆర్‌ అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాయని, అందుకు నూతనంగా మున్సిపల్‌లో పదవి చేపట్టిన వారంతా నిత్యం ప్రజల్లో ఉంటు ప్రజా సేవకు అంకితం కావాలని సూచించారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, పార్టీలకు అతీతంగా తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తాండూరు అభివృద్ధికి గతంలో ఇచ్చిన నిధులతో పాటు త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. నిధులను దుర్వినియోగం చేయకుండా సరైన విధంగా ఉపయోగించాల్సి బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేశారు. 


టీఆర్‌ఎస్‌ అధిష్టానం సూచన మేరకు అందరు కలిసికట్టుగా ఉంటు పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా సేవకు నిరంతరం సైనికుల్లా పనిచేయాలన్నారు. అదే విధంగా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డిని కూడా తాండూరు మున్సిపల్‌ పాలకవర్గాన్ని అభినందించారు. తాండూరు మున్సిపల్‌ అభివృద్ధికి జడ్పీ నుంచి నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన జడ్పీ చైర్‌పర్సన్‌ తప్పకుండా తాండూరుకు అధిక నిధులు కేటాయిస్తామన్నారు. అవసరమైతే తమ వంతు కృషిగా వ్యక్తి గతంగా కూడా తాండూరు ప్రజలకు తగిన సహాయ సహకారం అందిస్తామన్నారు. పార్టీలో అందరు కలిసి ఉంటూ చక్కగా పనులు చేయాలని సూచించారు.  


logo