ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 28, 2020 , 00:10:02

గ్రులాబీ పట్టాభిషేకం

గ్రులాబీ పట్టాభిషేకం
  • - నాలుగు మున్సిపాలిటీల పీఠాలు టీఆర్‌ఎస్‌ వశం
  • - ప్రశాంతంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక
  • - వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మంజుల
  • - తాండూరులో తాటికొండ స్వప్న
  • - పరిగి మున్సిపల్‌ చైర్మన్‌గా ముకుంద అశోక్‌
  • - కొడంగల్‌లో చైర్మన్‌గా జగదీశ్వర్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ పురపాలికల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. అన్ని మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం మొదట కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చిగుళ్లపల్లి మంజుల రమేశ్‌, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్న, పరిగిలో చైర్మన్‌గా ముకుంద అశోక్‌, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా జగదీశ్వర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుల అవసరం లేకుండానే ఎన్నిక జరుగడం విశేషం. 


జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి కావడంతో సోమవారం ఆయా మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఎటువంటి ఘటనలు జరుగకుండా నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. తొలుత కౌన్సిలర్లుగా ఎన్నికైన నూతన సభ్యులతో ఆయా మున్సిపాలిటీలకు నియమించిన ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఎక్స్‌ఆఫిషియో సభ్యుల అవసరం లేకుండానే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల పీఠాలను టీఆర్‌ఎస్‌ పార్టీ చేజిక్కించుకుంది. అదేవిధంగా నాలుగు మున్సిపాలిటీల్లోనూ పూర్తి మెజార్టీ ఉండడంతో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చిగుళ్లపల్లి మంజులరమేష్‌, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్న, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌గా ముకుంద అశోక్‌, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా జగదీశ్వర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వికారాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా శంషాద్‌బేగం, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా దీపనర్సింహులు, పరిగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రసన్న లక్ష్మి, కొడంగల్‌ మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌గా ఉషారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు. అయితే పరిగి, కొడంగల్‌ చైర్మన్‌ అభ్యర్థులు ముందే ఖరారు కాగా, వికారాబాద్‌, తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులపై సోమవారం ఉదయం వరకు ఉత్కంఠ నెలకొన్నది. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి చిగుళ్లపల్లి మంజులతోపాటు లంక పుష్పలతారెడ్డి మధ్య పోటీ ఉండగా చివరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం చిగుళ్లపల్లి మంజుల పేరును ఖరారు చేసింది. అదేవిధంగా తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ విషయంలోనూ తాటికొండ స్వప్నతోపాటు దీపనర్సింహులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తాటికొండ స్వప్న పేరును ఖరారు చేసింది. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరికతో టీఆర్‌ఎస్‌ పార్టీ బలం 20కి చేరడంతో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు అవసరం లేకుండానే చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


logo