మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jan 28, 2020 , 00:08:26

మున్సిపల్‌ చైర్మన్‌గా నేనావత్‌ రాంపాల్‌నాయక్‌

మున్సిపల్‌ చైర్మన్‌గా నేనావత్‌ రాంపాల్‌నాయక్‌

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: ఆమనగల్లు మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా నేనావత్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌గా దుర్గయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సాగింది. జిల్లా డిప్యూటీ సీ ఈఓ జానకిరెడ్డి ప్రత్యేకాధికారిగా పాల్గొనగా జిల్లా ఎన్నికల సహాయ అధికారిగా వెంకట్రాములు, తహసీల్దార్‌ చందర్‌రావు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉదయం 11గంటలకు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఉండగా ఆయా వార్డుల్లో గెలుపొందిన సభ్యులంతా హాజరయ్యారు. ఎన్నికల నియమావళిని పురస్కరించుకుని బీజేపీ నుంచి ఎన్నికైన 12మంది సభ్యులను టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన ఇద్దరు సభ్యులు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి ఎన్నికైన ఒక్క సభ్యుడికి వేర్వేరుగా స్థానాలను కేటాయించారు. జానకిరెడ్డి ఇటీవల గెలుపొందిన 15వార్డు  కౌన్సిలర్లను క్రమ సంఖ్య ప్రకారం 1వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన సభావట్‌ కృష్ణ నుంచి ప్రారంభిం చి 15వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన లక్ష్మణ్‌తో ప్రమాణ స్వీకార తంతును ముగించారు. 


అనంతరం మధ్యాహ్నం 12.30కు మున్సిపాలిటీలో ఫుల్‌ కోరం సభ్యులు హాజరైనందున మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పక్రియ ను చేపట్టారు. ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్‌గా నేనావత్‌ రాంపాల్‌నాయక్‌ను 4వ వార్డుకు చెందిన కృష్ణ  ప్రతిపాదించగా 7వ వార్డుకు చెందిన టీ.విజయకృష్ణ బలపరిచారు. వైస్‌ చైర్మన్‌గా బీమనపల్లి దుర్గయ్యను 15వ వార్డు సభ్యుడు లక్ష్మణ్‌ ప్రతిపాదించగా, 14వ వార్డు సభ్యుడు చెన్నకేశవులు బలపరిచారు. అయితే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ కోసం సభ్యుల్లో ఎవరూ ముందుకురాకపోవడంతో చేతులెత్తే విధానం ద్వారా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను జానకిరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం పురస్కరించుకుని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ధర్మేశ్‌, సురేశ్‌యాదవ్‌, సుందరయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


logo