మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jan 28, 2020 , 00:04:26

ప్రజాతీర్పు స్ఫూర్తితో ముందుకెళ్తాం

ప్రజాతీర్పు స్ఫూర్తితో ముందుకెళ్తాం

తాండూరు, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజా తీర్పు స్ఫూర్తితో ముందుకెళ్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లాలోని 4 మున్సిపాలిటీలపై తాము అనుకున్న విధంగా గులాబీ జెండా ఎగురవేశామని అన్నారు. అందుకు ‘కారు గుర్తు’కు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు, సహకరించిన నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలోని మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీలుగా మారుస్తామన్నారు. అందుకు నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ పాలకవర్గాలు నిర్లక్ష్యం చేయకుండా పట్టణాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణతోపాటు పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి ప్రజలు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ముందెన్నడూ లేని విధంగా తెలంగాణ సర్కార్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధిక స్థానాల్లో గెలుపొందడం జరిగిందన్నారు. 


తాండూరు మున్సిపల్‌పై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేసేందుకు తమతోపాటు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు నిత్యం అభ్యర్థుల గెలుపునకు సహకరించడం జరిగిందన్నారు. తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి సర్వాంగ సుందరంగా మారుస్తామని అన్నారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌రావూఫ్‌, సీనియర్‌ నేతలు కరుణం పరుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, రాజుగౌడ్‌, శ్రీను, అమితానంద్‌, నర్సింహులు, మహిపాల్‌రెడ్డి, మసూద్‌, అజయ్‌ప్రసాద్‌, రాజు, రవిందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రఘు, దత్తు ఉన్నారు. logo