గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:25:47

అన్ని రంగాల్లో అభివృద్ధి

 అన్ని రంగాల్లో అభివృద్ధి
  • రైతుబంధు ద్వారా 1.79లక్షల రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో రూ.255కోట్లు జమ
  • 10,407మందికి కేసీఆర్‌ కిట్‌
  • 3.88లక్షల మందికి కంటి పరీక్షలు, 2,592మందికి శస్త్రచికిత్సలు,56,047మందికి అద్దాలు పంపిణీ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు సరైన విధంగా అందే విధంగా చూస్తూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా తెలిపారు. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవందనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా 675 ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లను పూర్తి చేసి 2,599కిలోమీటర్ల పొడవునా పైపులైన్‌ నిర్మించడం జరిగిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 733 చెరువులను రూ.234.78లక్షలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 75శాతం సబ్సిడీతో 908 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2019-20 ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున 1.79లక్షల మంది రైతులకు రూ.255కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. బీమా ద్వారా 194మంది రైతులకు రూ.97లక్షలు మరణించిన రైతుల నామినీల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. భూ ప్రక్షాళనలో భాగంగా జిల్లాలో 2,67,588 వ్యవసాయదారుల భూ ఖాతాలు ఉండగా ఇప్పటి వరకు 2,25,616మంది రైతులకు ఈ పాస్‌ పుస్తకాలు జారీ చేశారన్నారు. 3,88,267మందికి కంటి పరీక్షలు..

2,25,616మంది రైతులకు ఈ పాస్‌ పుస్తకాలు జారీ చేశారన్నారు.
3,88,267మందికి కంటి పరీక్షలు..


కంటి వెలుగు ద్వారా ఇప్పటి వరకు 3,88,267మందికి పరీక్షలు చేసి 56,047మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేసి 2,592మంది శస్త్ర చికిత్సల కోసం ఇతర దవాఖానలకు సిఫారస్‌ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 12,332మంది గర్భిణులు నమోదు చేసుకోగా, 10,407మందికి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగాయని, కేసీఆర్‌ కిట్స్‌తోపాటు ఇతర వసతులు కల్పించడం జరిగిందన్నారు. 1107అంగన్‌వాడీ కేంద్రాల్లో 18,993మంది 3 సంవత్సరాల నుంచి 6సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి రూ.5.4కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. హరితహారం పథకంలో 2018-19 సంవత్సరానికి గాను 2.50కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 1.36కోట్ల మొక్కలను నాటమని అన్నారు.


208 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు..

హరితహారం, పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్లు పంపిణీ చేపట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 208 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. టీయూఎఫ్‌ఐడీసీ పథకం ద్వారా తాండూరు పురపాలక సంఘంలో రూ.25కోట్ల వ్యయంతో పట్టణ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.  మత్స్యకారుల అభివృద్ధి కోసం సుమారు 25.99లక్షల చేప పిల్లలను 100శాతం సబ్సిడీతో 88చెరువులు, 4 ప్రాజెక్టుల్లో పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 36,059మంది వృద్ధాప్య పింఛన్లు రూ.3.94కోట్లు, 49,104మంది వితంతువులకు రూ.5.47కోట్లు నెలకు రూ.2016 చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. 12,881మంది వికలాంగులకు రూ.2.12కోట్లు,  472మంది చేనేత కార్మికులకు రూ.5.27కోట్లు,  167మంది గీతా కార్మికులకు రూ.1.92కోట్లు, 41మంది బీడీ కార్మికులు, 42వేల మంది ఆసరా పింఛన్‌దారులకు మొత్తం రూ.38.48కోట్లను ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసిందన్నారు. 


జిల్లాలో 3,605స్వయం సహాయక సంఘాలకు రూ.10.152కోట్లను బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 565 వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను, రూ.75.44కోట్లతో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతగిరి, సర్పన్‌పల్లి, కోట్‌పల్లి ప్రాజెక్టులను పర్యటక రంగాలుగా అభివృద్ధికి రూ.2కోట్లతో ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2018-19కి గాను 123మంది లబ్ధిదారులకు షాదీముబారక్‌ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే 9,684మంది విద్యార్థులకు 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను ప్రత్యేక తరగతులు నిర్వహణకు వారికి రూ.4లక్షల వ్యయంతో అల్పహారం ఏర్పాటు చేశామని వివరించారు. షెడ్యూల్డ్‌ కులాల వసతి గృహల్లో సంక్షేమం కోసం  2018-19 సంవత్సరానికి గాను రూ.4.27కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని శివసాగర్‌ చెవురు వద్ద తెలంగాణ పార్కును అభివృద్ధికి రూ.20కోట్లతో ప్రతిపాధనలు ప్రభుత్వానికి పంపామని, త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్నారు.


253మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు

 జిల్లాలో 3,108మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు దరఖాస్తులు చేసుకోగా 253మంది లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మైనార్టీ బాలుర, బాలికల కోసం ఒక్కొక్కటి చొప్పున 100పడకల వసతి గృహాలను తాండూరులో రూ.2.11కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. జిల్లాలోని 40 క్రిస్టియన్‌ మైనార్టీ సంస్థలకు  రూ.3కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో మైనార్టీలకు రంజాన్‌ పండుగ సందర్భంగా 10వేల గిఫ్ట్‌ ప్యాక్‌లను, ఇఫ్తార్‌ విందుల ఏర్పాటుకు  రూ.17లక్షలను ఏర్పాటు చేశామన్నారు. ఐఎఫ్‌డీఎస్‌ పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు ఈ సంవత్సరం రూ.16కోట్లు విలువ చేసే 2,300 బైక్‌లు, 54ఆటోలు, 6 హైజెనిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వేహికిల్స్‌, 20 మొబైల్‌ ఔట్‌ లేట్స్‌ను 75శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 6 గోదాములను కొత్తగా తాండూరు, పరిగి, ధారూరు, వికారాబాద్‌, మర్పల్లి, నవాబుపేటలో రూ.18కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రతి నెల దాదాపు 450 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని మధ్యాహ్న భోజన పథకం కింద విద్యా సంస్థలకు, సంక్షేమ హాస్టళ్లకు పంపిణీ చేస్తున్నామన్నారు. 


జిల్లాలో ఇప్పటి వరకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌ పథకం ద్వారా పండ్ల తోటల ఉత్పత్తి, ఉత్పాదకతను, నాణ్యతను పెంచుటకు గాను 1,792.70హెక్టర్లకు రూ.375.80లక్షల వ్యయంతో 1,535మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో సారా తయారిని వీడనాడిన 116గిరిజన కుటుంబాలకు రూ.2.32కోట్లతో వివిధ ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్‌ పథకం ద్వారా 156 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొదటి, రెండో విడుతల్లో జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసి అన్ని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, డంపింగ్‌యార్డు నిర్మాణం, ట్రాక్టర్ల పంపిణీ, శ్మశానవాటికల నిర్మాణాలు, స్థలాల కేటాయింపులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా రూపొందించుటకు అన్ని రకాల చర్యలు చేపట్టి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని అన్నారు. దీంతో రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, జేసీ అరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయా పాఠశాలల విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వివిధ వేషధారణలతో నృత్యాలు చేశారు.


logo