సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:18:13

కొడంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అరెస్ట్‌

కొడంగల్‌ మున్సిపల్‌  కమిషనర్‌ అరెస్ట్‌
  • ఉద్యోగాలు, తక్కువ ధరకే భూములంటూ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు
  • అదుపులోకి తీసుకున్న గద్వాల పోలీసులు

 కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  కొడంగల్‌ ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న మోహన్‌లాల్‌, కొడంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గద్వాలలో ఎంపీడీవో కార్యాలయంలో విధుల నిర్వహణ క్రమంలో ఉద్యోగాలు, తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని కొందరి నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసినట్లు అభియోగం వచ్చింది. దీంతో గద్వాల పోలీసులు కొడంగల్‌లో శనివారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి గద్వాల పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. ప్రస్తుతం కొడంగల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్‌లాల్‌, గట్టు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌ రఘునందన్‌, ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయ ఉద్యోగి గట్టు విజయ్‌కుమార్‌  ముఠాగా ఏర్పడి రైల్వే ఉద్యోగాలు, తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ  ఐదేండ్లుగా  వసూళ్లకు పాల్పడ్డారు. 


2014లో మక్తల్‌ పరిసర ప్రాంతాల్లో కొత్తగా రైల్వేలైన్‌ వస్తుందని, జోగుళాంబ గద్వాల జిల్లాకు చింతలపేటకు చెందిన సునీతను నమ్మించి రూ.12 లక్షలు, తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని, రెండితల ఆదాయాన్ని పొందవచ్చని కోస్గి ఎంపీడీవో బాలమణి నుంచి రూ.19 లక్షలు వసూలు చేశారు. భూములు, ఉద్యోగాలు ఇప్పించకలేకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు 2019 డిసెంబల్‌లో గద్వాల పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించి వీరి ముగ్గురితో పాటు వీరికి సహకరించిన డ్రైవర్లు బస్వరాజప్ప, జైపాల్‌యాదవ్‌లతో కలిపి ఐదుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని తెలిపారు. శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని సోమవారం విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. వీరిద్దరే కాకుండా చాలామంది బాధితులు ఉన్నారని, ఇప్పుడు ఇద్దరి ఫిర్యాదు అందిందని తెలిపారు.


logo