సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jan 25, 2020 , 23:53:02

అఖండ విజయం

 అఖండ విజయం
  • జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ కైవసం
  • గెలుపులో ఎమ్మెల్యేలే కీలకం
  • అన్నిచోట్లా ఎంఐఎంకు ఎదురుగాలి
  • పరిగి మినహా మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ గల్లంతు
  • తాండూరులో పెరిగిన బీజేపీ బలం
  • రేవంత్‌రెడ్డికి మరోసారి షాకిచ్చిన కొడంగల్‌ ప్రజలు
  • ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌
  • పరిశీలించిన కలెక్టర్‌ ఆయేషా, ఎస్పీ నారాయణ


 వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పుర ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించింది. దీంతో కారు జోరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాకు జైకొట్టిన సబ్బండ వర్గాలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పట్టం కట్టారు. మున్సిపోల్స్‌లో మొదట్నుంచి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు దిశానిర్దేశం చేసిన మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ గెలుపులో అంతా తానై విజయపథంవైపు నడిపించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు గెలుపు బాధ్యతలు తీసుకున్న          కీలకంగా వ్యవహరించారు. ఆయా మున్సిపాలిటీల ప్రజలు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ప్రతిపక్షాల అభ్యర్థులు ప్రచార సమయంలోనే ఓటమిని ఒప్పుకున్నా.. అది ఫలితాల్లో స్పష్టమైంది. గతంతో పోలిస్తే జిల్లాలో మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ బలం పెరిగింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోర ఓటమిని మిగిల్చాయి. పరిగిలో మినహా మూడు పుర పాలికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నది. బీజేపీ కొంత పుంజుకోగా, గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. మరోవైపు ఎంఐఎం పార్టీ జిల్లాలో ఈసారి సగానికిపైగా తన ఉనికిని కోల్పోయింది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. కేంద్రాలను కలెక్టర్‌ ఆయేషా పరిశీలించారు. అభ్యర్థులు, వారి అనుచరుల రాకతో కేంద్రాల వద్ద సందడి నెలకొన్నది. టీఆర్‌ఎస్‌ అఖండ విజయంతో గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.

ఫలితాల ప్రధానాంశాలు...

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నికల పూర్తి ఫలితాలు సాయంత్రం 4 గంటల వరకు వెలువడ్డాయి. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవంకాగా 95 వార్డులకు ఎన్నికలు జరుగాయి. అయితే వీటిలో టీఆర్‌ఎస్‌-60, కాంగ్రెస్‌-19, బీజేపీ-8, ఎంఐఎం-4, ఇతరులు-2, స్వతంత్ర అభ్యర్థులు-4 గెలుపొందారు. అయితే కొడంగల్‌ మున్సిపాలిటీ ఫలితాలు వన్‌సైడ్‌ టీఆర్‌ఎస్‌కురాగా, పరిగి మున్సిపాలిటీ ఫలితాలు అందరిని తీవ్ర ఉత్కంఠ రేపడం గమనార్హం. అయితే జిల్లాలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ లభించింది. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని 34వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనంతలక్ష్మి 941 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 1,064 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలోని 16వ వార్డుకు సంబంధించి మూడు సార్లు రీ కౌంటింగ్‌ నిర్వహించారు. మొదట బీజేపీ అభ్యర్థి శ్రీలత స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వసంత రీ కౌంటింగ్‌ నిర్వహించాలని కోరారు, రీ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. తిరిగి రీకౌంటింగ్‌ చేయాలని బీజేపీ అభ్యర్థి కోరగా మూడోసారి రీకౌంటింగ్‌ చేసిన అధికారులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 20 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. అదేవిధంగా పరిగి మున్సిపాలిటీలోని 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వర్ల రవీంద్ర కాంగ్రెస్‌ అభ్యర్థిపై 8 ఓట్ల తేడాతో గెలుపొందారు.logo