గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 25, 2020 , 00:09:32

నేడే పుర తీర్పు

నేడే పుర తీర్పు
  • - ఫలితాలపై వీడనున్న ఉత్కంఠ
  • - ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
  • - మధ్యాహ్నం 3గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం
  • - మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • - తాండూరులో 12 టేబుళ్లు, వికారాబాద్‌లో 11, పరిగిలో 5, కొడంగల్‌లో 4 టేబుళ్లు ఏర్పాటు
  • - ఒక్కో టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి నియామకం
  • - తొలుత కొడంగల్‌ ఫలితాలు వెల్లడి
  • - చివరగా తాండూరు..
  • - గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమావికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పుర ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఆయా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 3గంటల వరకు ఫలితాలపై పూర్తి స్పష్టత రానున్నది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం బ్యాలెట్‌ పత్రాలను గుర్తుల వారీగా వేరు చేసి కట్టలు కట్టి లెక్కిస్తారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. తొలి ఫలితం ఉదయం 11గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరిగిలో జడ్పీహెచ్‌ఎస్‌ నెం.1 పాఠశాల, వికారాబాద్‌లో శ్రీఅనంతపద్మనాభ కాలేజీ, తాండూరులో సెయింట్‌ మార్క్స్‌ హైస్కూల్‌, కొడంగల్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ద్వారా లెక్కింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుచేయనున్నారు. జిల్లాలో 95 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన 351మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏ మున్సిపాలిటీపై ఏ పార్టీ జెండా ఎగురనుంది, ఏ వార్డులో ఏ అభ్యర్థి గెలుస్తారనేది మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి అనంతరం బ్యాలెట్‌ పత్రాలను గుర్తుల వారీగా వేరు చేసి కట్టలు కట్టి ఓట్లను లెక్కించనున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తొలి ఫలితం ఉదయం 11 గంటల వరకు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే పరిగి మున్సిపాలిటీకి సంబంధించి పరిగిలోని జడ్పీహెచ్‌ఎస్‌ నంబర్‌.1 ఉన్నత పాఠశాలలో, వికారాబాద్‌ మున్సిపాలిటీకి సంబంధించి వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభ కాలేజీలో, తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి తాండూరు పట్టణంలోని సెయింట్‌ మార్క్స్‌ హైస్కూల్‌, కొడంగల్‌ మున్సిపాలిటీకి సంబంధించి కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయా మున్సిపాలిటీల అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోని 95 వార్డుల్లో 351 మంది అభ్యర్థులు ఆయా పార్టీల ద్వారా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు...

మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి, అనంతరం బ్యాలెట్‌ పత్రాలను గుర్తుల వారీగా వేరు చేసి, 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున కట్టలు కట్టి లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది నియామకంతోపాటు రిటర్నింగ్‌ అధికారుల నియామకం, టేబుళ్లు తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతోపాటు ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం చేశారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధించి వికారాబాద్‌లో 32 వార్డులకుగాను 11 టేబుళ్లు 3 రౌండ్లు, తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులకుగాను 12 టేబుళ్లు మూడు రౌండ్లు, పరిగి మున్సిపాలిటీలో 15 వార్డులకుగాను 5 టేబుళ్లు మూడు రౌండ్లు, కొడంగల్‌ మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 4 టేబుళ్లు మూడు రౌండ్లలో పూర్తి ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలో ప్రతి రౌండ్‌కు 11 వార్డులు, తాండూరు మున్సిపాలిటీలో 12 వార్డులు, పరిగి మున్సిపాలిటీలో 5 వార్డులు, కొడంగల్‌ మున్సిపాలిటీలో 4 వార్డుల ఫలితాలను ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకుగాను ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించారు. అయితే ఒక్కొ టేబుల్‌కు ఇద్దరు కౌంటింగ్‌ సహాయకులతోపాటు ఒక పర్యవేక్షకులు ఉండనున్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 96 మంది, తాండూరులో 108 మంది , పరిగిలో 45 మంది, కొడంగల్‌ మున్సిపాలిటీలో 36 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపునకు నియమించారు. అదేవిధంగా  తొలుత కొడంగల్‌, చివరగా తాండూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమా...

నేడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు జిల్లా అంతటా టెన్షన్‌ నెలకొంది. ఏయే వార్డులో ఎవరూ విజయకేతనం ఎగురవేస్తారు, ఏ మున్సిపాలిటీలో చైర్మన్‌ పీఠం ఎవరికి దక్కనుందనే దానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.
అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని , మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వార్‌ వన్‌సైడ్‌ అనే విధంగా ఫలితాలు వెలువడనున్నాయని జిల్లా అంతటా  వినిపిస్తుంది. నాలుగు మున్సిపాలిటీల్లోనూ తమ ఉనికిని కాపాడుకునేందుకుగాను పోటీ చేసిన ప్రతిపక్షాలు సింగిల్‌ డిజిట్‌ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచే అవకాశాలు కూడా లేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీసం పోటీనివ్వలేకపోయిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వినిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డుల్లో గెలుస్తామనే దానిపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పష్టమైన అంచనాతో ఉన్నారు.

లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, బాణా సంచాలు కాల్చుటకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదని జిల్లా పోలీసు అధికారి ఎం.నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని  తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినైట్లెతే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛసంఘటనలు జరుగకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.  నాలుగు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కలిపి మొత్తం 420 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. వికారాబాద్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 110 మంది, తాండూర్‌లో 125 మంది, పరిగిలో 110 మం ది, కొడంగల్‌లో 75 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. logo