మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 24, 2020 , 04:51:38

ముహూర్తం ఖరారు

ముహూర్తం ఖరారు
  • - 27న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
  • -అదేరోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • - గెలుపోటములపై ఆయా పార్టీల అంచనాలు
  • - నాలుగు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాల కైవసంపై టీఆర్‌ఎస్‌ ధీమా
  • - చైర్మన్‌ అభ్యర్థులెవరనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చిన అధికార పార్టీ
  • - అభ్యర్థులను 26న లేదా 27న ఉదయం ప్రకటించనున్నటీఆర్‌ఎస్‌ అధిష్టానం
పుర పాలకమండళ్ల తొలి సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం మున్సిపాలిటీ నూతన పాలక మండళ్ల తొలి సమావేశం తేదీని ప్రకటించింది. ఈ మేరకు 27న తొలి సమావేశం జరుగనున్నది. అదే రోజు ఉదయం 11గంటలకు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది. 4 చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ పూర్తి ధీమాతో ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన నివేదికల మేరకు చైర్మన్‌ అభ్యర్థుల ఎన్నికపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నెల 26న లేదా 27న అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. రేపు ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. కాగా, గెలుపోటములపై ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు.
- వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల కొత్త పాలకమండళ్ల తొలి సమావేశ ముహూర్తం ఖరార య్యింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీ నూతన పాలకమండళ్ల తొలి సమావేశం తేదీని ప్రకటించింది. ఈ నెల 27న మున్సిపాలిటీల నూతన పాలకమండళ్ల తొలి సమావేశం జరుగనుంది. అదేరోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికతో పాటు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 27న ఉదయం కౌన్సిలర్లుగా ఎన్నికైనా కొత్త సభ్యులతో ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు, తదనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు చైర్మన్‌ ఎన్నికతోపాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల చైర్మ న్‌ అభ్యర్థులు ఎవరనే దానిపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని పూర్తి ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ అభ్యర్థి ఎవరనేది స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన నివేదికల మేరకు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఈ నెల 26న లేదా 27న ఉదయంలోగా చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించనుంది.

టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఖరారు..

జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల చైర్మన్‌ అభ్యర్థులకు సంబంధించి టీఆర్‌ఎస్‌ దాదాపు ఖరారు చేసింది. అయితే ఇప్పటికే పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికే స్పష్టత ఉండగా,...వికారాబాద్‌, తాండూర్‌ మున్సిపాలిటీల్లోనే చైర్మన్‌ అభ్యర్థులెవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. పరిగి టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ముకుంద అశోక్‌, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా జగదీశ్వర్‌రెడ్డి పేర్లు దాదా పు ఖరారు అయ్యింది. తాండూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ రేసు లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీపానర్సింలుతో పాటు తాటికొండ స్వప్నలు చైర్మన్‌ పీఠం కోసం తీవ్ర పోటీ పడుతున్నారు. తాండూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దీపానర్సింహులు పేరునే పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చర్చించుకుంటున్నారు. తాటికొండ స్వప్నను అభ్యర్థిగా ప్రకటింపజేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నా రు. పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటిస్తారా లేదా ఒక్కొక్కరికి రెండున్నరేళ్ల చొప్పున చైర్‌పర్సన్‌గా అవకాశమిస్తారా అనేది మరో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. మరోవైపు వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా ఇద్దరు పోటీ పడుతున్నారు. లంక పుష్పాలతా రెడ్డితోపాటు మంజులరమేశ్‌కుమార్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి రేసులో ఉన్నారు. వీరివురిలో ఒకరి పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించనుంది.

గెలుపొటములపై అంచనా...

వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఎవరూ గెలుస్తారనే దానిపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ పూర్తైనప్పటి నుంచి ఏ మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థి ఎవరు, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనే దాని పై జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధితో పాటు జిల్లా అంత టా ఇదే చర్చించుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం ఆయా మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారనే దానిపై ఇప్పటికే ఓ అంచనకు వచ్చారు. జిల్లాలోని నాలుగు టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో ప్రచారానికి ముందు ఉన్న అనుకూల పరిస్థితులే పోలింగ్‌ వరకు కొనసాగడంతో పరిగి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ 11 నుంచి 13వార్డుల్లో గెలుపు ఖాయమని పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీలోనూ మెజార్టి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించనుంది. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టి పోటీనిచ్చిందని ప్రచారం జరిగినప్పటికీ కొడంగల్‌ మున్సిపల్‌ ఓటర్లు మాత్రం భిన్నంగా తీర్పునిచ్చినట్లు అంచాన వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కొడంగల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీని చిత్తు చేసి మెజార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కొడంగల్‌ మున్సిపాలిటీలో 8నుంచి 10వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కొడంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి పక్కాగా అంచనా వేస్తున్నారు.

 మరోవైపు తాండూర్‌ మున్సిపాలిటీలో చివరిలో పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారడం, కాంగ్రెస్‌ పూర్తిగా పోటీకి దూరంగా ఉండడం, ఎంఐఎం ఐదారు వార్డుల్లోనే ప్రభావం చూపడంతో తాండూర్‌ మున్సిపాలిటీల్లో 22 నుంచి 25 వార్డుల్లో పక్కాగా గెలుస్తామని తాండూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వికారాబాద్‌ మున్సిపాలిటీలోనూ కారు జోరు పక్కా అని అంతటా చర్చ జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం కావడం టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ వార్డుల్లో గెలుపు పక్కా అయిపోయిందనే చెప్పవచ్చు. అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఇప్పటికే 2 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా, మరో 18 నుంచి 20 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని వికారాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం ఐదు లేదా ఆరు స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఒకటి, తాండూర్‌ మున్సిపాలిటీలో నాలుగు లేదా ఐదు వార్డుల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో మాత్రం బిజెపి మూడు లేదా నాలుగో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.logo