గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 21, 2020 , 00:01:42

అభివృద్ధికి ఓటెయ్యండి

 అభివృద్ధికి ఓటెయ్యండి


తాండూరు, నమస్తే తెలంగాణ: జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ విజయం ఖాయమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని ఇంద్రాచౌక్‌ చౌరాస్తాలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో మున్సిపల్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేకపోవడంతో నామమాత్రపు పోటీగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం మోసపూరిత మాటలు ప్రజలు నమ్మరాదన్నారు. ముందెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ పాలనలోని గత ఐదున్నరేండ్లలో తాండూరు అన్ని విధాల అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తాండూరు అభివృద్ధికి ఇచ్చిన రూ.100 కోట్లలో 60 కోట్ల నిధులు విడుదల చేయడంతో వివిధ పనులు చేయడం జరిగిందని మిగితా రూ.40 కోట్లతో పాటు మరో రూ.60 నుంచి రూ.70 కోట్ల నిధులు తాండూరును సుందరంగా మార్చుటకు సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి విడుదల చేపిస్తామని హామీ ఇచ్చారు. తాండూరు మరింత అభివృద్ధికోసం 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు అశీర్వదించి గెలిపించాలని కోరారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే నైతిక హక్కు ఉందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంలకు ఓటేస్తే చెత్త కుండిలో వేసినట్టేనని, ఆ పార్టీల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తాండూరులో కొందరు కావాలనీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు టీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన కేసులు పెడతామన్నారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి పొత్తు లేదని, బీజేపీ అబద్ధపు ప్రచారం నమ్మరాదని సూచించారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృష్ణార్జునుల్లా అందరిని కలుపుకొనిపోతూ 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు రాత్రిపగళ్లు కృషి చేయడం అభినందనీయమన్నారు.

పార్టీ పటిష్టతకు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించేందుకు గులాబీ నేతలు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిపై ప్రజల్లో అపార విశ్వాసం ఉందని ప్రతిపక్షాల మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోరని స్పష్టం చేశారు. 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమ బుజస్కందాలపై ఉందన్నారు. అందుకు తగ్గట్లు నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలందరి సహకారంతో మున్సిపల్‌పై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టురాని నేతలు నిరుత్సాహం చెందరాదని, సీనియార్టిని గౌరవిస్తూ తప్పకుండా నామినేటేడ్‌ పోస్టుల్లో మంచి అవకాశం కల్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అడుగడుగున అడ్డంకులు వేసేందుకు కుట్రలు చేస్తున్న విషయాలు ప్రజలు గ్రహించి. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల మాటలు నమ్మకుండా అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ నేతలు అబ్దుల్‌ రావూఫ్‌, కరుణం పరుషోత్తంరావు, సునీతాసంపత్‌, లక్ష్మారెడ్డి, మసూద్‌తో పాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.logo