మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jan 20, 2020 , 02:49:51

టీఆర్‌ఎస్‌దే హవా

 టీఆర్‌ఎస్‌దే హవా


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నేటితో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. గత రెండు రోజుల్లో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలోని తాండూర్‌, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ప్రతిపక్షాలు గట్టి పోటిస్తున్నట్లు కనిపించినా... సీన్‌ రివర్సయ్యింది. పరిగి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు పోటీ యే లేనప్పటికీ... తాండూర్‌, వికారాబాద్‌, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ప్రచారం మొదలైన తొలుత రెండు రోజులు గట్టిగానే పోటీనిచ్చినా...తదనంతరం ప్రతిపక్ష పార్టీలు చేతులేత్తేశాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓ వైపు,...మరోవైపు ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపక్షాలు ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిచాయి. ప్రధానంగా తాండూర్‌ మున్సిపాలిటీలో ఎంఐఎం గత ఎన్నికల్లో గెలుపొందిన స్థానాల కంటే అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం తాండూర్‌ మున్సిపాలిటీలో ఎంఐఎంకు సంబంధించి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. గతంలో గెలుపొందిన స్థానాల్లో సగం కూడా గెలిచే పరిస్థితి లేదని ప్రజల అభిప్రాయంతో పాటు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో స్పష్టమవుతుంది. తాండూర్‌లో ఎదురుగాలి వీస్తుందని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో నేడు ప్రచార సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పరిగి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతుందని కొందరు ప్రచారం చేసినప్పటికీ...ప్రస్తుతం పరిగి మున్సిపాలిటీలో పరిస్థితులు పూర్తిగా తారుమారై ఒకట్రెండు స్థానాలకే కాంగ్రెస్‌ పార్టీ సరిపెట్టుకునే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడనుంది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో 4మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి పాలయ్యే విధంగా పరిస్థితులు మారిపోయాయి.

4 మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీకి అనుకూలం...

జిల్లాలోని తాండూర్‌, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీనిస్తాయని అంచనా వేసినప్పటికీ పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారడంతో ప్రతిపక్షాలు సైలెంట్‌ అయిపోయాయి. తాండూర్‌ మున్సిపాలిటీలో మొదట్నుంచి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసినప్పటికీ ప్రచారం మొదలైన ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఎంఐఎం గట్టి పోటీనిస్తుందని, గత ఎన్నికల్లో గెలుపొందిన స్థానాల కంటే అధిక స్థానాల్లో గెలవడం ఖాయమని, చైర్మెన్‌ ఎన్నికలో ఎంఐఎం కీలకం కానుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ... రెండు రోజుల్లో మారిన రాజకీయ సమీకరణాలను చూస్తే ఎంఐఎం పార్టీ పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రజల అభిప్రాయాలు, ఏ సర్వేలో చూసినా ఎంఐఎంకు గత ఎన్నికల్లో గెలుపొందిన స్థానాల్లో ఈ దఫా ఎన్నికల్లో సగానికే పరిమితయ్యే అవకాశాలున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాండూర్‌ మున్సిపాలిటీలోని గడపగడపకూ తిరుగుతూ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి అండ్‌ టీం పక్కా ప్రతివ్యూహాలతో 28నుంచి 30వార్డుల్లో గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. ఎంఐఎం 4వార్డులకు, బీజేపీ ఒకటి లేదా రెండు, కాంగ్రెస్‌ ఒక స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. పరిగి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదనే చెప్పవచ్చు. పరిగి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో గెలుపొంది క్లీన్‌స్వీప్‌ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రతిమా రెడ్డి, సోదరుడు అనిల్‌ రెడ్డితోపాటు పరిగి మున్సిపాలిటీ, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పరిగి మున్సిపాలిటీలోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే 13 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మిగతా రెండు వార్డుల్లో కూడా గెలుపొందే దిశగా ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తొలిసారి ఎన్నికలు జరుగనున్న కొడంగల్‌ మున్సిపాలిటీలోనూ చైర్మెన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకునే దిశగా ముందుకెళ్తుంది. సంబంధిత మున్సిపాలిటీలో ప్రతిపక్షాలు నామమాత్రంగా పోటీ చేస్తుండడంతో అధికార పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. కొడంగల్‌ మున్సిపాలిటీలోని 12వార్డుల్లో పది వార్డుల్లో గెలుపొందే అవకాశాలున్నాయి. మరోవైపు ఒకవేళ కాంగ్రెస్‌ తరపున గెలిచిన కూడా ముందే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందే స్థానిక నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే గెలిపించినా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఒకరిద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులపై జరుగుతున్న ప్రచారంతో కొడంగల్‌ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తున్న టీఆర్‌ఎస్‌నే గెలిపించుకోవాలని కొడంగల్‌ మున్సిపాలిటీ ప్రజానీకం నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతుంది. మరోవైపు వికారాబాద్‌ మున్సిపాలిటీలోనూ తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడనుంది. వికారాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పలు వార్డుల్లో గట్టి పోటీనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంకాగా మరో 16నుంచి 18వార్డుల్లో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ ఒక స్థానం గెలిచే అవకాశాలున్నాయి. మరోవైపు వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఖాతా తెరువాలని ఆశమీదున్న ఎంఐఎం పార్టీ ఆశలు ఈ దఫా ఎన్నికల్లో ఆవిరి కానున్నాయి.logo