శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Jan 20, 2020 , 02:47:20

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ


తాండూరు టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో నూటికి నూరుశాతం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని  కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులో 2కే రన్‌ నిర్వహించారు. ఆదివారం కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా, ఎస్పీ నారాయణతో కలిసి 2కే రన్‌ ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి సెంట్‌ మార్క్స్‌ స్కూల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు క్రీడాకారులు, మహిళా  సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ముందు కళాజాత చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో  కలెక్టర్‌ ఆయేషా, ఎస్పీ నారాయణ, తాండూరు ఆర్డీవో వేణుమాధవ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌అలీ, అధికారులు, విద్యార్థులు, మహిళలు ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ ఆయేషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఓటు హక్కు వినియోగంపై అందరికీ సమాన బాధ్యతను కల్పించిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ‘స్వీప్‌'తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సఖి లాంటి మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కుపై చైతన్యం కల్గిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యార్థులకు నిరంతరం చైతన్య కలిగించే విధంగా శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో నూటికి నూరు శాతం అర్హులైన వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇంకా మిగిలిన వారు ఉంటే వారి చేత కూడా ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

పోలింగ్‌ రోజు ఉదయం నుంచే ఓటింగ్‌ సరళి ఆధారంగా ఓటు వేయలేని వారిని గుర్తించి వారిచేత   ఓటు హక్కు వినియోగించుకునేలా మహిళా సంఘాలు ఇంటింటికీ తిరిగి చైతన్య పర్చాలన్నారు. విద్యార్థులు కూడా వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేలా తెలుపాలని సూచించారు. ఈ ఎన్నికల్లో నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా అందరు బాధ్యతగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ ఓటు ఎంతో బలమైందని, మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే ఓటు ఒక్కటే మార్గమన్నారు. మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ  ఓటు వేయాలని, ఇతరులతో వేయించాలన్నారు. మరోవైపు సెయింట్‌ మార్క్స్‌ పాఠశాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖి మోడల్‌ పోలింగ్‌ కేంద్రం, ఇతర ప్రదర్శనలు ఆకర్షించాయి.  కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది  పాల్గొన్నారు.


logo