మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 18, 2020 , 00:09:48

మున్సిపోల్స్‌పై పక్కాగా నిఘా

మున్సిపోల్స్‌పై పక్కాగా నిఘా

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఎన్నికల యంత్రాంగంతోపాటు మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను జిల్లా పోలిస్‌ యంత్రాంగం కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రచారం మొదలు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా పోలీసు అధికారులు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు బ్యాలెట్‌ బాక్సులు చేరవేయడంతోపాటు స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లా అంతటా పక్కాగా నిఘా పెట్టి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, పరిమితికి మించి డబ్బును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటూ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు.  అంతేకాకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను  పోలీస్‌ యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు బలగాలతోపాటు వీడియో చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు సరిపోను పోలీస్‌ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. మరోవైపు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా పలువురిని బైండోవర్‌ చేయడంతోపాటు లైసెన్స్‌ గన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవేకాకుండా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపై జిల్లా పోలీస్‌ అధికారి నారాయణతో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ...

నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ?

జిల్లా పోలీస్‌ అధికారి:  మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా జిల్లా అంతటా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో ప్రతి మున్సిపాలిటీకి రెండు చొప్పున 8 చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశాం. సంబంధిత చెక్‌పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణతోపాటు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్కా నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాం. అంతేకాకుండా నాలుగు మున్సిపాలిటీల్లో ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తుగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 64 మందిని బైండోవర్‌ చేశాం. అంతేకాకుండా ఎన్నికలు సందర్భంగా లైసెన్స్‌ గన్స్‌ను జారీ చేసిన 450 మంది నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికల అనంతరం అవసరమని వచ్చిన వారికి తిరిగి ఇచ్చేసాం. అయితే తనిఖీల్లో భాగంగా కొత్రేపల్లి వద్ద రూ.లక్ష, కెరెళ్లి వద్ద రూ.50 వేల నగదుతోపాటు రూ.2 లక్షల విలువ చేసే వెండిని స్వాధీనం చేసుకున్నాం.

నమస్తే తెలంగాణ: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు సరిపోను సిబ్బంది ఉన్నారా ?

జిల్లా పోలీస్‌ అధికారి: జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి డీఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు 657 మంది అవసరమని అంచనా వేశాం. అయితే ఇప్పటివరకు జిల్లాలో 477 మంది అందుబాటులో ఉన్నారు, మిగతా సిబ్బందిని త్వరలో రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు సమకూరుస్తారు.   నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్‌తోపాటు ఓట్ల లెక్కింపునకు సంబంధించి 657 మంది అవసరమని అంచనా వేయగా, వీరిలో నలుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 42 మంది ఎస్‌ఐలు, 76 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 284 మంది కానిస్టేబుళ్లు, 135 మంది హోంగార్డులు, 56 మంది అర్మ్‌డ్‌ సిబ్బంది, మూడు ప్లాటూన్ల భద్రతా దళాలు అవసరం ఉంది. అయితే ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 26 మంది ఎస్‌ఐలు, 76 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 241 మంది కానిస్టేబుళ్లు, 73 మంది హోంగార్డులు, 50 మంది ఆర్మ్‌డ్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇంకా ఒక డీఎస్పీ, 8 మంది ఎస్‌ఐలు, 43 మంది కానిస్టేబుళ్లు, 62 మంది హోంగార్డులు, 6 మంది ఆర్మ్‌డ్‌ సిబ్బంది, మూడు ప్లాటూన్ల భద్రత దళాలు అవసరమని రాష్ట్ర పోలీస్‌ అధికారులకు నివేదించాం. అదేవిధంగా వికారాబాద్‌ మున్సిపాలిటీకి 172 పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవసరంకాగా 140 మంది, తాండూర్‌ మున్సిపాలిటీలో 240 మంది పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవసరంకాగా 136 మంది, పరిగి మున్సిపాలిటీలో 108 మంది పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవసరంకాగా 95 మంది, కొడంగల్‌ మున్సిపాలిటీలో 77 మంది పోలీస్‌ అధికారులతోపాటు సిబ్బంది అవసరంకాగా 55 మంది అందుబాటులో ఉన్నారు.

నమస్తే తెలంగాణ: జిల్లాలో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు ?

జిల్లా పోలీస్‌ అధికారి: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. అయితే జిల్లాలోని కొడంగల్‌ మున్సిపాలిటీ మినహా  మిగతా మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 28 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి.  వీటిలో వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 11 అతి సమస్యాత్మక కేంద్రాలు, తాండూర్‌లో 9, పరిగి మున్సిపాలిటీలో 8 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అయితే సంబంధిత అతి సమస్యాత్మక పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా క్షుణ్ణంగా వీడియా చిత్రీకరిస్తారు. అదేవిధంగా పోలింగ్‌కు 48 గంటల ముందే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాలి, లేదంటే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈనెల 20 సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది, 21, 22 తేదీల్లో ప్రచారం నిర్వహించొద్దు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు స్థానికంగా ఉండరాదు. అంతేకాకుండా బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలించడం, తిరిగి పోలింగ్‌ పూర్తయి అనంతరం పోలింగ్‌ కేంద్రాల నుంచి తిరిగి లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను తరలించే సమయంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీస్‌ ఎస్కార్ట్‌తో బ్యాలెట్‌ బాక్సులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం.


logo