సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jan 18, 2020 , 00:09:09

‘పురుగుల అన్నం’పై స్పందించిన కలెక్టర్‌

‘పురుగుల అన్నం’పై స్పందించిన కలెక్టర్‌

కోట్‌పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ద్వారా సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం ‘పురుగుల అన్నం మాకొద్దు’ అని నమస్తే తెలంగాణ దిన పత్రికలో వెలువడిన శీర్షికపై  కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా స్పందించారు. వెంటనే స్థానిక ఎంపీడీవో లక్ష్మీనారాయణకు పాఠశాలకు వెళ్లి విషయాన్ని పరిశీలించి, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. దీంతో ఎంపీడీవో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విద్యా కమిటీ చైర్మన్‌ యాదగిరి, మత్స్యశాఖ మండల అధ్యక్షుడు నక్కల బందెయ్య, పంచాయతీ కార్యదర్శితో కలిసి పాఠశాలకు వెళ్లి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం చేసి చూశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇది వాస్తవమేనని, ఆ విషయంపై ఇదివరకే లెటర్‌ రాశామని, మళ్లీ కూడా పంపించామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో ఎంపీడీవో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని అడిగితే అప్పుడప్పుడు పురుగులు వస్తున్నాయని, మెనూ ప్రకారం స్నాక్స్‌ కూడా రావడం లేదని, రుచిలేని సాంబారు, కూరగాయలను తాము తినలేకపోతున్నామని, సగంలో సగం మంది విద్యార్థులం  ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నామని చెప్పారు. నాణ్యతతో అందించే విధంగా చూడాలని చేప్పినారు. ఇదే విషయాన్ని విద్యార్థులతో లెటర్‌ల రూపంలో వారి అభిప్రాయాలను రాయించుకున్నారు.  కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు.  కార్యక్రమంలో చెల్డ్‌లైన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌, మాజీ విద్యా కమిటీ చైర్మన్‌ గాజుల ఈశ్వర్‌ ఉన్నారు.logo