గురువారం 04 జూన్ 2020
Vikarabad - Jan 14, 2020 , 00:46:01

గులాబీ గెలుపు లాంఛనమే

 గులాబీ గెలుపు లాంఛనమే
  • -జిల్లాలో ఏకపక్షం కానున్న మున్సిపోల్స్‌
  • -ప్రచారానికి ముందే చేతులెత్తేసిన ప్రతిపక్షాలు
  • -ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌
  • -దిక్కుతోచని స్థితిలో బీజేపీ
  • -వికారాబాద్‌ కాంగ్రెస్‌లో ఎన్నికలకు దూరంగా ఏసీఆర్‌ వర్గం
  • -ప్రసాద్‌కుమార్‌ వర్గానికే టికెట్ల కేటాయింపు
  • -తాండూరులో మూడో స్థానం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు
  • -పరిగిలో బీజేపీ నేతల మధ్య వర్గపోరు
  • -అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనం కానున్నది.  షెడ్యూల్‌కు ముందు ప్రతిపక్షాలు గట్టి పోటీనిస్తాయని అంచనా వేసుకున్నప్పటికీ ఎన్నికలకు ముందే చేతులెత్తేయడంతో గులాబీ శ్రేణుల గెలుపు ఖాయంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుల మధ్య వర్గపోరు నడుస్తుండడంతో జిల్లా కేంద్రంలో ఒక వర్గం పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉన్నది. మరో మున్సిపాలిటీలో పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులు లేక ఢీలా పడిన పరిస్థితి నెలకొన్నది. బలవంతంగా అభ్యర్థులతో నామినేషన్‌ వేయించినా.. ఓడిపోయేదానికి పోటీ చేయడం ఎందుకని ఒక వార్డు నుంచి అభ్యర్థి నామినేషన్‌ను ఆదివారం ఉపసంహరించుకోగా, మరో వార్డులో నామినేషనే వేయకపోవడం గమనార్హం. మరోపార్టీ బీజేపీకి జిల్లాలో దిక్కుతోచని స్థితి నెలకొన్నది. ఆ పార్టీ నాయకులు పైకి బాగానే కనబడుతున్నా లోలోపల వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది క్యాడర్‌ కూడా ఆ పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండడంతో సబ్బండ వర్గాల ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు జైకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో త్వరలో జరుగనున్న మున్సిప ల్‌ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పూర్తి ఏకపక్షంగా గెలిచేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే కానుంది. షెడ్యూల్‌కు ముందు ప్రతిపక్షాలు గట్టి పోటీనిస్తాయని అంఛనా వేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఎన్నికలకు ముందే చేతులేత్తేయడంతో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోనూ విజయం ఖాయంగా మారిపోయింది. ఎన్నికలు కూడా పూర్తిగా ఏకపక్షంగా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఒక మున్సిపాలిటీలో వర్గపోరుతో ఒక నాయకుడి వర్గం పూర్తిగా దూరంగా ఉండగా, మరో మున్సిపాలిటీలో పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులెవరూ లేకపోవడంతో ఢీలా పడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ పరిస్థితి కూడా దిక్కుతోచని స్థితి నెలకొంది. బీజేపీలోనూ పైకి ఆ పార్టీ నాయకులు బాగానే కనపడుతున్న లోలోపల వర్గ రాజకీయాలు చేస్తుండడంతో ఉన్న కొద్దిమంది క్యాడర్‌ కూడా ఆ పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టిన సంబండ వర్గాల ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకే జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి మున్సిపాలిటీలోనూ కనీవినీ ఎరుగని అభివృద్ధితోపాటు దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుండడంతో ప్రజలంతా రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పాలనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో రోడ్లు, వీధిలైట్లు, మురుగుకాల్వలు తదితరాలను పట్టించుకోకపోవడమే కాకుండా ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కుతున్నారు. ఏదేమైనా జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తుంది.

ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌

వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి ఘోర పరాభావం ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో కనీసం పోటీనిచ్చే పరిస్థితి కూడా కనపడడం లేదు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కొంత పోటీనిస్తుందని అనుకున్న వికారాబాద్‌ మున్సిపాలిటీలో సింగిల్‌ డిజిట్‌తోనే సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇద్దరు మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్‌- ఏ.చంద్రశేఖర్‌లు మీడియా ముందు కలిసి పనిచేస్తామని ఎలాంటి వర్గాలు లేవని పైకి ఆలింగనాలు చేసుకున్నా...వారిద్దరి ఆలింగనాలు ఉత్తుత్తివే అని రెండు రోజుల్లోనే స్పష్టం కావడం గమనార్హం. అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఇద్దరు మాజీ మంత్రులకు మంచి పట్టుండడంతోపాటు పరిచయాలు కూడా ఉన్నాయి. వీరిద్దరు కలిసి పనిచేస్తే టీఆర్‌ఎస్‌ను ఓడించే పరిస్థితి లేకపోయినప్పటికీ గట్టి పోటీ ఉండేది. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం ప్రసాద్‌కుమార్‌ వర్గానికే టికెట్లు కేటాయించడం, ఏ.చంద్రశేఖర్‌తోపాటు ఆయన వర్గమంతా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఏ.చంద్రశేఖర్‌ వర్గానికి ఒక్క టికెట్‌ కూడా ఇవ్వకపోవడంతో ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు.

అంతేకాకుండా ఆయన వర్గం కూడా సంబంధిత మున్సిపాలిటీలో టికెట్‌ దక్కిన వారికి మద్దతుగా ఎక్కడా కనపడడం లేదు. ఏదేమైనా ప్రతి మున్సిపల్‌ ఎన్నికల్లో వికారాబాద్‌ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకోకతప్పదు. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలో పార్టీని ముందుకు తీసుకెళ్లే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరూ లేకపోవడంతో పరువును కాపాడుకునేందుకుగాను అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే బలవంతంగా బరిలోకి దింపడంతో ఓడిపోయే దానికి పోటీ చేయడం ఎందుకంటూ పదో వార్డులో నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఆదివారం తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతోపాటు ఒక వార్డులో నామినేషనే వేయకపోవడం గమనార్హం. మరోవైపు ఒక్క రమేశ్‌ మహారాజ్‌ తప్ప ఎవరూ లేకపోవడంతో తాండూరు మున్సిపాలిటీలో మూడో స్థానం కోసం ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తొలిసారి ఎన్నికలు జరుగుతున్న పరిగి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముందే గుర్తించిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎవరూ ముందుకొచ్చిన వారికి టికెట్లను ఖరారు చేస్తూ అన్ని వార్డుల్లో పోటీ చేసి పరువు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తుంది. అంతేకాకుండా ఓడిపోతామని గుర్తించి ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా కనుమరుగైన ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అయితే కొడంగల్‌ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితే ఎదురుకానుంది. రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన అనంతరం మల్కాజిగిరి ఎంపీగా గెలిచినప్పటి నుంచి కొడంగల్‌కు పూర్తిగా దూరం ఉండడంతో ఆ పార్టీ క్యాడర్‌ కూడా ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఒకట్రెండు వార్డుల మినహా ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినా.. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ముందు ఓటమి తప్పదని సంబంధిత మున్సిపాలిటీలో చర్చ జరుగుతుంది.

దిక్కుతోచని స్థితిలో బీజేపీ...

నాలుగు మున్సిపాలిటీల్లోనూ బీజేపీ నామమాత్రంగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఒక్క తాండూరు మున్సిపాలిటీలోనే మూడు లేదా నాలుగు వార్డుల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప మిగతా ఏ మున్సిపాలిటీలో కూడా ఖాతా తెరిచే పరిస్థితి కనపడడం లేదు. ఎన్నికలకు ముందే ఎలాగూ ఓటమి ఖాయమని గుర్తించి 4 మున్సిపాలిటీల్లోనూ కొన్ని వార్డులకే అభ్యర్థులను బరిలో దింపారు. అయితే పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో అయితే కనీసం పోటీనిచ్చే పరిస్థితి లేకపోవడంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నామని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే తాండూరు మున్సిపాలిటీలోనూ రవిశంకర్‌ పటేల్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి బీజేపీలో చేరిన రమేశ్‌కుమార్‌ మధ్య లోలోపల వర్గపోరు నడుస్తుందని వినిపిస్తుంది. ఇద్దరు నేతలు అజమాయిషీ చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే 36 వార్డులకుగాను 26 వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపారు. వీరిలోనూ చాలా వరకు రమేశ్‌కుమార్‌ వర్గానికే చెందిన వారికే టికెట్లు దక్కడంతో రవిశంకర్‌ పటేల్‌ నామమాత్రంగా తాండూరుకు వచ్చిపోవడం తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు వికారాబాద్‌ మున్సిపాలిటీకి సంబంధించి నాయకులంతా ఐక్యంగా ఉన్నప్పటికీ ఒక వార్డుకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు కనీసం మూడో స్థానంలో కూడా ఉండని పరిగి మున్సిపాలిటీలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వర్సెస్‌ సీనియర్‌ నేతల మధ్య టికెట్ల విషయమై వార్‌ జరుగుతున్నట్లు తెలిసింది. పరిగి మున్సిపాలిటీలో ఎప్పటినుంచో బీజేపీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు కూడా తన వర్గానికి టికెట్లు దక్కించుకునేలా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందుకు సీనియర్‌ నేతలు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటుండడంతోపాటు ఆ పార్టీ రాష్ట్ర నేతలకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్‌ నేతలతో మంతనాలు జరిపినట్లు,..మరీ ఎవరిది పైచేయి అవుతుందనేది నేడు తేలనుంది.


logo