ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 14, 2020 , 00:43:35

మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
  • - వంద శాతం ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాలి
  • - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వాహణకు సంబంధించి సరిపడా ఎన్నికల సామగ్రిని సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి సూచించారు.  సోమవారం  కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి,  కలెక్టర్‌తో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌ పేపర్ల డిజైనింగ్‌, వార్డుల వారిగా సీరియల్‌ నెంబర్లు, అభ్యర్థుల గుర్తులను తెలుగు వర్ణమాల ప్రకారం ఉండేలా సంబంధిత నోడల్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పరిశీలించి మున్సిపాలిటీ వారీగా పంపిణీ చేయాలన్నారు. గుర్తించిన 7 ప్రధాన పార్టీలకు వారి పార్టీ గుర్తులను,  స్వతంత్య్ర అభ్యర్థులకు కామన్‌ గుర్తులను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వాహణలో ఆర్‌వో, ఏఆర్‌వోలు ఎన్నికల సామగ్రిని సమకూర్చుకొని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 100 శాతం ఓటరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది వారి ఓటు హక్కు వినియోగించుకొనేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ రోజున ఓటర్లు రెండు చోట్ల ఓటు వేయకుండా అధికారులు పర్యవేక్షించాలని, ఒకరి స్థానంలో మరొకరు ఓటు వేస్తే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను గుర్తించేందుకు వార్డుల వారీగా అదనపు పోలింగ్‌ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఎలాంటి సంఘటనలు జరుగకుండా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద బందోబస్తు పటిష్టంగా చేపట్టాలన్నారు. 

ఎన్నికల సిబ్బందికి శిక్షణ

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బంది ఈ నెల 17న ప్రత్యేకంగా నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ అయేషా ఆన్నారు. వీడియో కాన్ఫెరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఈ శిక్షణ తరగతులకు హాజరు కాని సిబ్బందికి ఈ నెల 17న   కలెక్టర్‌ కార్యాలయంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ శిక్షణ తరగతులకు సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని, హాజరు కాని వారిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ఈ నెల 17వరకు పూర్తి కావాలని ఆదేశించారు. దివ్యాంగులు, యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 2కే రన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఫొటో ఓటరు స్లిప్పులను ముద్రించి బీఎల్‌వోల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని, ఈ స్లిప్పులను ఓటు వేసే సమయంలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.   సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అరుణకుమారి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీధర్‌, ఈడీఎం మహమూద్‌, తదితరులు   పాల్గొన్నారు. logo