మంగళవారం 02 జూన్ 2020
Vikarabad - Jan 14, 2020 , 00:41:09

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
  • - మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
  • - జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హైమావతి
తాండూరు టౌన్‌: ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు హైమావతి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం ప్రభుత్వ నంబర్‌ వన్‌ పాఠశాలలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హైమావతి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పొలింగ్‌, ఎన్నికల లెక్కింపు తదితర ప్రక్రియలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్నికల నియమాళిని అనుసరిస్తూ మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులకు తగు వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు ఎన్నికల నిర్వహణ అధికారి, తాండూరు ఆర్డీవో వేణుమాధవరావు, సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌అలీలకు ఆదేశించారు. ఆమె వెంట తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పల నాయుడు, మున్సిపల్‌ అధికారులు ఈర్షాద్‌, మల్లికార్జున్‌, సిబ్బంది ఉన్నారు.

logo