గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 13, 2020 , 00:51:50

పల్లె ప్రగతి- 2 విజయవంతం

పల్లె ప్రగతి- 2 విజయవంతం
  • - రెండో విడుతతో మరింతగా మారిన గ్రామాల స్వరూపం
  • - జిల్లాలో 457 పాత బావులు, 304 బోర్లు పూడ్చివేత
  • - 3,661 స్థలాల్లో ముళ్లపొదలు, కంపచెట్లు తొలగింపు
  • - 1,466 నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు
  • - గ్రామాల్లో పనులు తనిఖీ చేసిన జిల్లాస్థాయి అధికారులు
  • - ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి
  • - ప్లాస్టిక్‌ నిర్మూలనకు మహిళలు నడుంబిగించాలి
  • - కొడంగల్‌ మండలంలో ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి


రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. మొదటి విడుతలో 30రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి చెందాయి. రెండో విడుతలో గతంలో జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తూ గ్రామాల్లో మరిన్ని పనులు చేపట్టారు. దీంతో పల్లెల్లో ప్రగతికి ప్రజాప్రతినిధులు, స్థాయి సంఘాల సభ్యులు, గ్రామస్తులు భాగస్వాములు కావాలనే సర్కారు ఉద్దేశం నెరవేరింది. ఈ నెల 2నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. మొదటి రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ఆదాయ, వ్యయాలు, మొదటి విడుతలో చేసిన పనులు, ఖర్చులు వివరాలను, చేయాల్సిన పనుల వివరాలను చదివి వినిపించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు.

తనిఖీ బృందాలు రోజూ వారికి కేటాయించిన మండలాల్లో తిరుగుతూ పనులు పకడ్బందీగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అలసత్వం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను నిరంతరం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బొంరాస్‌పేట మండలంలోని కొత్తూరులో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా గ్రామసభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిషేధానికి మహిళలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
- పరిగి, నమస్తే తెలంగాణ

పరిగి, నమస్తే తెలంగాణ : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. మొదటి విడుతలో 30 రోజులపాటు నిర్వహించిన పల్లె ప్రగతితో పల్లెల్లో మార్పు కన్పించగా, రెండో విడుతలో నిర్వహించిన కార్యక్రమాలతో గ్రామాలు మరింత సుందరంగా మారాయి. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజా ప్రతినిధులు, స్థాయి సంఘాల సభ్యులు, గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలనే సర్కారు ఉద్దేశం నెరవేరింది. ప్రతి గ్రామంలోను అందరు సమైక్యంగా పనిచేసి పల్లెల రూపురేఖలు మారేందుకు కృషి సల్పారు. ఈనెల 2 నుంచి ప్రారంభమైన పల్లెప్రగతి రెండో విడుత కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోను ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ పనులను జిల్లా స్థాయి విజిలెన్స్‌ అధికారుల బృందం తరుచుగా పరిశీలించడంతో అన్ని గ్రామాల్లో కార్యక్రమం విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేశారు. ఈ నెల 2న జిల్లాలోని 565 గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ప్రతి రోజూ చేపట్టాల్సిన పనులను ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోను ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సహకారంతో నిర్వహించారు. తరుచుగా అధికారుల పర్యటనలతో కార్యక్రమం మరింత పకడ్బందీగా అమలు జరిగేందుకు ప్రత్యేక కృషి చేశారు. ప్రభుత్వ పరంగా సైతం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతినెలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి నిధులు అందుతున్నాయి.   జిల్లాలోని 565 గ్రామపంచాయతీలకు రూ.12 కోట్లు వస్తున్నాయి. ఈ నిధులతో ఆయా గ్రామపంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. సర్కారు మంజూరు చేసిన నిధులు వెచ్చించి చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించేందుకు సైతం ఈ సారి కూడా విజిలెన్స్‌ అధికారులను నియమించారు. జిల్లా స్థాయి అధికారులను విజిలెన్స్‌ బృందంలో సభ్యులుగా నియమించడంతో వారికి కేటాయించిన మండలాల్లో పనుల నాణ్యతను అధికారులు పరిశీలించారు.

గ్రామాల్లో చేపట్టిన పనులు

రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ పనులు చేపట్టారు. జిల్లాలోని 565 గ్రామ పంచాయతీల్లోను మొదటి రోజు గ్రామసభలు నిర్వహించి మొదటి విడుత పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు చదివి వినిపించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల ఖర్చు వివరాలను సైతం తెలియజేశారు. గ్రామ ఆదాయ, వ్యయాలు, మొక్కల పెంపకానికి సంబంధించిన నర్సరీల ఏర్పాటు ఖర్చు వివరాలు, ట్రాక్టర్ల కొనుగోలు వివరాలు, ఇతర నెలవారి బిల్లుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. జిల్లా పరిధిలోని 18 మండలాల పరిధిలో గల అన్ని గ్రామపంచాయతీల్లోను ఈ గ్రామసభలు జరిగాయి. ప్రతి గ్రామంలోనూ పాదయాత్రలు సైతం నిర్వహించారు.

జిల్లాలోని 2450 రోడ్లను శుభ్రం చేయించారు. శ్రమదానం ద్వారా ఈ రోడ్లను ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో శుభ్రం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గల 3527.52 కిలోమీటర్ల మురికినీటి కాలువలన్నీ శుభ్రం చేసి, చెత్త చెదారాన్ని తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 3661 ప్రాంతాల్లో సర్కారు తుమ్మ, ముళ్లపొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. వీటితోపాటు ఇండ్లు, ఖాళీ స్థలాల్లో గల చెత్తను తొలగించే పనులు సైతం నిర్వహించారు. ఇందులో భాగంగా 3,433 ప్రాంతాల్లోని చెత్తను పది రోజుల వ్యవధిలో తొలగించారు. జిల్లాలోని సామూహిక ప్రాంతాలు, ఇతర స్థలాలకు సంబంధించి 1665 ప్రాంతాలను శుభ్రం చేయించారు.

జిల్లా వ్యాప్తంగా 457 పాడుబడిన బావులను పూడ్చి వేయడంతోపాటు పాడుబడిన 304 బోర్లను సైతం పూడ్చి వేశారు. మురికినీరు నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి, రోడ్డు పక్కన సైతం నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో 1590 స్థలాల్లో లోతట్టు ప్రాంతాలలో మురికినీరు నిలువకుండా తగు చర్యలు చేపట్టారు. జిల్లాలో 3455 ప్రాంతాల్లో మురికి కాలువల పక్కన, ఇతర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లించారు. 2424 ప్రాంతాల్లో రోడ్లపై గుంతలను పూడ్చి వేశామని అధికారులు పేర్కొన్న గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా పరిధిలోని 777 అంగన్‌వాడీ కేంద్రాలు, 610 ప్రాథమిక పాఠశాలలు, 156 కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాలలు, 162 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, 213 కమ్యూనిటీ భవనాలు, 298 ఇతర భవనాలు, 106 మార్కెట్‌ స్థలాలు పది రోజుల వ్యవధిలో శుభ్రం చేశారు.

ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, స్థాయి సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోను శ్రమదానం  నిర్వహించగా, ఈ శ్రమదానాల్లో 24,065 మంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1918 ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు వేలాడుతున్న వాటిని గుర్తించి సరి చేశారు. వీటితోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో పాత వాటి స్థానంలో 1466 కొత్త విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని 3,218 స్తంభాలకు మూడవ వైరు ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 8919 విద్యుత్‌ దీపాలను మార్పు చేశారు. జిల్లాలోని గ్రామపంచాయతీలలో 204 మంది దాతలను గుర్తించగా వారిలో 72 మంది నుంచి విరాళాలు అందాయి. రూ.3,03,701 దాతలు ఇస్తామని పేర్కొనగా రూ.23,7701 ఇప్పటివరకు అందించారని అధికారులు తెలిపారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు ఆదాయ, ఖర్చు, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.

 పల్లె ప్రగతిలో పాల్గొన్న ఉన్నతాధికారులు.

రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా స్థాయి అధికారులు పాలుపంచుకున్నారు. కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజూ పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు ప్రతిరోజూ కొన్ని గ్రామాల్లో పర్యటిస్తారనే సమాచారంతో అన్ని గ్రామాల్లోను అప్రమత్తంగా ఉంటూ, పల్లె ప్రగతి కార్యక్రమం మరింత చక్కగా నిర్వహించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించడంతో వారు ఆయా మండలాల్లోని పలు గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన విజిలెన్స్‌ కమిటీల వారు, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు సైతం పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించారు.

నిరక్షరాస్యుల లెక్క తేల్చేందుకు సర్వే

ఈ సంవత్సరం రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే ఉద్దేశంతో సంవత్సరం పొడవునా ‘ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌' కార్యక్రమం అమలు చేయనున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆయా గ్రామాల్లో నిరక్షరాస్యుల సంఖ్యను తేల్చడానికి సర్వే కొనసాగుతుంది. రిటైర్డ్‌ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, ఇతరుల సహకారంతో ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నది సర్కారు ఉద్దేశం. ఇందులో భాగంగా మొదట ఆయా గ్రామాల్లో నిరక్షరాస్యుల లెక్క తేలితే, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నది తెలుస్తుంది. తద్వారా ఆయా గ్రామాల వారీగా సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. ఇందుకుగాను ప్రతి గ్రామంలో నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నది ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వే సాధ్యమైనంత త్వరగా చేపట్టి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆదివారంతో పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమం ముగియడంతో నిరక్షరాస్యుల సర్వే మరింత వేగంగా కొనసాగనుంది. తద్వారా మరికొద్ది రోజుల్లోనే ఆయా గ్రామాల వారీగా నిరక్షరాస్యుల వివరాలు తేలనున్నాయి. అనంతరం ప్రతి గ్రామం వారీగా సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమం అమలుకు సర్కారు కసరత్తు చేస్తుంది.


logo