మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 13, 2020 , 00:50:52

మెజార్టీ స్థానాల్లో గులాబీ గెలుపు ఖాయం

మెజార్టీ స్థానాల్లో గులాబీ గెలుపు ఖాయం
  • - సీఎం కేసీఆర్‌ చేతుల్లోనే తాండూరు చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ
  • - వర్గాల్లేకుండా అభ్యర్థుల విజయానికి కృషి
  • - 16న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సభ
  • - ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని.. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలో ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. అధిష్టానం సూచన మేరకు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అందించబోతున్నామని తెలిపారు. తాండూరులో ఒక్కో వార్డు నుంచి టిక్కెట్టు ఆశించిన ఆశావహులు అధికంగా నామినేషన్లు వేశారని, ఈనెల 14న వారి చేత నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూస్తున్నామని అన్నారు. వారికి నామినేటెడ్‌ పదవులు, ఇతర పదవులు అందించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఉపసంహరణ తరువాత ఎలాంటి వర్గాల్లేకుండా అందరి గెలుపునకు కృషి చేసేవిధంగా కార్యకర్తలకు ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు తాండూరులో చైర్‌ పర్సన్‌ అభ్యర్థి ఎంపిక సీఎం కేసీఆర్‌ చేతుల్లోనే ఉందని, సీల్డ్‌ కవర్‌లో ఆయన ఎవరి పేరు ఎంపిక చేస్తే వారినే అభ్యర్థిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

తమ నాయకుడు ఎప్పుడూ సీఎం కేసీఆరే అని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. ఇందులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అంటూ ఏమి లేదని.. గ్రూపులే లేవని తేల్చిచెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని సూచించారు. పోటీ అంటూ లేని టీఆర్‌ఎస్‌ 36 స్థానాల్లో గెలిచి అన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఈనెల 16న మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులైన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సభ ఉంటుందని, దీనిని విజయవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌లు లక్ష్మారెడ్డి, కొట్రిక విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రావూఫ్‌, నాయకుడు రాజుగౌడ్‌ తదితరులు ఉన్నారు.


logo