గురువారం 04 జూన్ 2020
Vikarabad - Jan 13, 2020 , 00:45:28

మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
  • - కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా
  • - పరిగి మండల కార్యాలయంలో పోలింగ్‌ అధికారులకు శిక్షణ
  • - శిబిరాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్‌

పరిగి, నమస్తే తెలంగాణ: ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా సూచించారు. ఆదివారం పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన పోలింగ్‌ ఆఫీసర్లు, సహాయ పోలింగ్‌ ఆఫీసర్ల శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయేషా మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ల్లో సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ల్లో సమయానుకూలంగా పోలింగ్‌ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్‌ వివరించారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ సూచించారు. వికారాబాద్‌ ఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీవోలు, ఏపీవోలు పోలింగ్‌కు ముందురోజు రిసెప్షన్‌ సెంటర్‌లో మెటీరియల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. పోలింగ్‌ బూత్‌లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు. పోలింగ్‌ రోజు ఆయా పార్టీల ఏజెంట్‌లు ఉదయం 6.45 గంటలకు లోపలికి వచ్చేలా చూడాలని, అప్పటివరకు వారు రాకున్నా బాక్స్‌ను సీల్‌ చేయాలన్నారు. పోలింగ్‌ తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఏజెంట్‌ల సంతకాలు తీసుకోవాలని ఆర్టీవో సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, పరిగి మున్సిపల్‌ కమిషనర్‌ తేజిరెడ్డి, రిసోర్స్‌పర్సన్‌లు పాల్గొన్నారు.


logo