సోమవారం 25 మే 2020
Vikarabad - Jan 12, 2020 , 01:07:18

పల్లెప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

పల్లెప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

దౌల్తాబాద్‌ : పల్లెప్రగతిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఆర్‌డీఏ పీడీ జాన్సన్‌ అన్నారు. శనివారం దౌల్తాబాద్‌ మండలంలోని ర్యాలగుట్ట తండా, దేవర్‌ఫస్లవాద్‌, నంద్యానాయక్‌తండా, లొట్టిగుంటతండా, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పర్యాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండోవిడుత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ గ్రామాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామా ల్లో ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, ఇంకుడు గుంతలను నిర్మించుకొని వ్యర్థపు, వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పారిశుధ్యంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే అనర్థాలపై ప్రజలకు వివరిస్తూ ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్లాస్టిక్‌ కాల్చివేస్తే దాని ద్వారా వచ్చే పొగతో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డీఆర్‌సీ కేంద్రాలకు తరలించాలన్నారు. మురుగు నీటిని రోడ్లపైకి వదిలే వారికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, తహసీల్దార్‌ వెంకటయ్య, ఎంపీడీవో తిరుమల స్వామి, ఏపీవో దస్తయ్య, టెక్నికల్‌ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌వాడీ టీచర్‌లు, ఆశకార్యకర్తలు, మహిళా సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.


logo