బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 01:03:48

పాఠశాలల్లో సంక్రాంతి సందడి

పాఠశాలల్లో సంక్రాంతి సందడి

తాండూరు టౌన్‌: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం తాండూరు పట్టణంలోని ఆపిల్‌ కిడ్స్‌, శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, ప్రభుత్వ పాఠశాలల్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు గాలిపటాలను తయారు చేసి ఎగురవేయగా.. విద్యార్థినులు పాఠశాలల ఆవరణలో అందమైన ముగ్గులు వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో సందడిగా గడిపారు. కార్యక్రమంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌  చైర్మన్‌ ద్యావరి విష్ణువర్దన్‌రెడ్డి, కరస్పాండెంట్‌ పట్లోళ్ల సర్వోత్తమ్‌రెడ్డి, అకాడమిక్‌ ఇన్‌చార్జి ద్యావరి జయవర్దన్‌రెడ్డి, ఆపిల్‌ కిడ్స్‌ ప్రిన్సిపల్‌ వనజారెడ్డి, ఉపాధ్యాయులు సుష్మ, వినీత, ప్రీతి, విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దేముల్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సంక్రాంతిని పురస్కరించుకొని శనివారం విద్యార్థులకు రంగవల్లి(ముగ్గుల పోటీ), గాలి పటాలను ఎగురవేసే పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ముగ్గులను వేయడంతో పాటు రకరకాల గాలి పటాలను ఎగురవేయడం జరిగింది. వివిధ పండుగల విశిష్టతలు విద్యార్థులకు తెలియజేయడానికే పాఠశాలలో ఈ రకమైన పోటీలను నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు యూసుపొద్దీన్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సి.రాములు అన్నారు.  అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కోటబాసుపల్లి పాఠశాలలో..
తాండూరు రూరల్‌: మండలంలోని కోటబాసుపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.  అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు శ్రీశైలం, శోభ, సుమంగళ, స్వప్న, మోయిజ్‌ మహ్మద్‌, రాధిక, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


logo