శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 00:58:01

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • -వికారాబాద్‌ మున్సిపాలిటీలో 3, తాండూరులో 2, కొడంగల్‌ ఒకటి
  • -తాండూరులో ఒక్క సెట్‌కు మించి దాఖలు చేసిన కారణంగా 71 నామినేషన్ల తిరస్కరణ
  • -పరిశీలన అనంతరం 4 మున్సిపాలిటీల్లో 713 నామినేషన్లు ఆమోదం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులు శనివారం నామినేషన్లు పరిశీలించారు. అయితే 4 మున్సిపాలిటీల్లో కలిపి పలు కారణాలతో 77 నామినేషన్లను తిరస్కరించారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 3 నామినేషన్లను, తాండూరులో 2, కొడంగల్‌లో ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో ఎవరైతే రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారో వాటిలో ఒక సెట్‌ నామినేషన్‌ను ఆమోదించి మరో సెట్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించినట్లు ఈ విధంగా మొత్తం 71 నామినేషన్లను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్‌ మున్సిపాలిటీకి సంబంధించి... రెండు ఓట్లు ఉన్న కారణంగా 24వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన విజయమ్మ నామినేషన్‌ను, 14వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రశాంత్‌కుమార్‌ కాంట్రాక్టర్‌ అయి ఉండడంతో ఆయన నామినేషన్‌ను, రెండో ప్రతిపాదిత సంతకం లేకపోవడంతో 30వ వార్డులో నామినేషన్‌ వేసిన రాములమ్మ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో ఒరిజినల్‌ కుల ధ్రువీకరణ పత్రం జతపర్చకపోవడంతో 20వ వార్డులో టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేసిన ఉష నామినేషన్‌ను, 5వ వార్డులో నామినేషన్‌ దాఖలు చేసిన కిష్టయ్య గత ఎన్నికల్లో చేసిన ఎన్నికల ఖర్చును చూపించకపోవడంతో అనర్హుడిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే కొడంగల్‌ మున్సిపాలిటీలో 3వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన శివకుమార్‌ రాథోడ్‌ డిపాజిట్‌ చెల్లించని కారణంగా నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే పరిగి మున్సిపాలిటీలో అన్ని సరిగ్గా ఉండడంతో అధికారులు ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరించలేరు. అయితే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైన అనంతరం 4 మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో 713 నామినేషన్లను ఆమోదించగా, పరిగి మున్సిపాలిటీలో 125 నామినేషన్లు, తాండూరులో 222, వికారాబాద్‌లో 282, కొడంగల్‌ మున్సిపాలిటీలో 84 నామినేషన్లను ఆమోదించారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు రేపటితో ముగియనుంది, అదేరోజు ఆయా వార్డుల్లో పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించనున్నారు. 


logo