శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jan 09, 2020 , 19:31:18

తొలిరోజు 28 నామినేషన్లు

తొలిరోజు 28 నామినేషన్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ప్రారంభమయ్యింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తొలిరోజు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీలో 15 మంది నామినేషన్లను దాఖలు చేయగా, వికారాబాద్‌ మున్సిపాలిటీలో 11, కొడంగల్‌, పరిగి మున్సిపాలిటీల్లో ఒక్కొ నామినేషన్‌ దాఖలు అయినట్లు ఆయా మున్సిపాలిటీల అధికారులు వెల్లడించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి 12 మంది టీఆర్‌ఎస్‌, ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు బీజేపీ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 7, కాంగ్రెస్‌ నుంచి ఒకటి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక నామినేషన్‌, కొడంగల్‌ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ నుంచి ఒక నామినేషన్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే నామినేషన్ల స్వీకరణ గడువు రేపు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి పోటీలో ఎవరూ ఉంటారనేది నేడు కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఆయా వార్డుల్లో బరిలో దిగే అభ్యర్థులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సర్వేల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పరిగి మున్సిపాలిటీలో 8 వార్డులకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారుకాగా, మిగతా వార్డులకు నేడు స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఎంపిక చేయనున్నారు. తాండూరు మున్సిపాలిటీలోనూ ప్రతి వార్డులో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా సర్వే ఆధారంగా నేడు ఆయా వార్డుల్లో ఎవరూ బరిలో దిగుతారనేది స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నేడు ఖరారు చేయనున్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దాదాపు ఖరారుకాగా, వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఆయా వార్డుల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సర్వే నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ సర్వే ఆధారంగా నేడు అభ్యర్థులెవరనేది నిర్ణయించనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడంతో అన్ని వార్డులకు చివరి రోజే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు సాయంత్రం 5 గంటల వరకు గడువుండడంతో ఆఖరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లోనూ అధిక మొత్తంలో నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి.


logo