శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Jan 15, 2020 , 00:17:36

మున్సిపల్‌ బరిలో

మున్సిపల్‌ బరిలో
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
  • ప్రచారానికి మరో 6 రోజులే గడువు
  • ప్రచారం షురూ... జోరు పెంచనున్న టీఆర్‌ఎస్‌
  • వికారాబాద్‌ మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక
  • ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన అధికారులు
  • 4మున్సిపాలిటీల్లో 439 మంది నామినేషన్ల ఉపసంహరణ

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల తరపున ఇద్దరు, ముగ్గురు వేసిన నామినేషన్లను వెనక్కి తీసుకునేలా ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేసి నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చేశా రు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి నాలుగు మున్సిపాలిటీల్లో బీ-పారం ఇచ్చిన అభ్యర్థులు తప్ప ఏ ఒక్కరూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, పలు వార్డుల్లో టికెట్‌ ఆశించి నామినేషన్‌ దాఖలు చేసిన ఆశావాహులు సైతం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని వారితో చర్చించడంతో ఆశావాహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోని 95వార్డులకు 351మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు ఎన్నికలు జరుగకముం డే జిల్లాలో రెండు వార్డు స్థానాలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ప్రచారంలో 4మున్సిపాలిటీల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.


95వార్డులు.. 351మంది అభ్యర్థులు..

జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోని 95వార్డుల్లో 351మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అయితే అత్యధికంగా తాండూర్‌ మున్సిపాలిటీలోనే అభ్యర్థులు పోటీలో నిలిచారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 14వ వార్డుతో పాటు 25వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చింతకింది రామస్వామి, చిగుళ్లపల్లి మంజులరమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక జరుగగా, మరో 32వార్డులకు ఎన్నికలు జరుగనున్నారు. 32వార్డులకు 103మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 32, కాంగ్రెస్‌-32, బీజేపీ-17, ఎంఐఎం-4, టీడీపీ-2, సీపీఎం-1, స్వతంత్రులు-15మంది పోటీలో నిలిచారు. అదే విధంగా తాండూర్‌ మున్సిపాలిటీలో 36వార్డులకు గాను 148మంది అభ్యర్థులు, పరిగి మున్సిపాలిటీలో 15వార్డులకు 54మంది అభ్యర్థులు పోటీలో నిలవగా టీఆర్‌ఎస్‌ నుంచి 15, కాంగ్రెస్‌-15, బీజేపీ-7, టీడీపీ-2, సీపీఎం-3, స్వతంత్రులు-12మంది పోటీలో నిలిచారు. కొడంగల్‌ మున్సిపాలిటీలో 12వార్డులకు 46మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 12, కాంగ్రెస్‌-11, బీజేపీ-8, ఎంఐఎం-2, సీపీఎం-1, టీడీపీ-2, స్వతంత్రులు-10మంది బరిలో ఉన్నారు. అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలో 285మంది నామినేషన్లు దాఖలు చేయగా రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించగా, మరో 180మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తాండూ ర్‌ మున్సిపాలిటీలో 295నామినేషన్లు దాఖలు చేయగా ఒక నామినేషన్‌ తిరస్కరించగా, మరో 146మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పరిగి మున్సిపాలిటీలో 125మంది నామినేషన్లను దాఖలు చేయగా 74మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీలో 85మంది నామినేషన్లను దాఖలు చేయగా ఒక నామినేషన్‌ను తిరస్కరించగా, మరో 38మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే నాలుగు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్‌, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపలేరు. తాండూర్‌ మున్సిపాలిటీలోని 4వార్డులకు కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయకపోవడం గమనార్హం. 


ప్రచారం షురూ...

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం అధికారికంగా మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలోని 4మున్సిపాలిటీల్లో నేటి నుంచి ప్రచారం ప్రారంభించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు అస్ర్తాలను సిద్ధం చేసుకున్నారు. ప్రచారానికి ఇంకా 6రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షం చేసుకోవడంలో వేగం పెంచనున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నేటి నుంచి మరింత ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ఇందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరపున ప్రచా రం నిర్వహించనున్నారు. ఇప్పటికే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పరిగి మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, తాండూర్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిలు నేటి నుంచి ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోజుకు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల జాబితాను వార్డుల వారీగా టీఆర్‌ఎస్‌ సిద్ధం చేసింది. జాబితా ప్రకారం ప్రతి లబ్ధిదారుడి ఇంటింటికీ వెళ్లి ఓటును అభ్యర్థించనున్నారు. అంతేకాకుండా ప్రచారంలో భాగంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, మిషన్‌ భగీరథ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అయితే ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లను అడుగనున్నారు. అయితే ఏ వార్డులో అయితే కొంత వెనుకబడి ఉన్నారో ఆ వార్డుపై టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు.


logo