మా ఇంటికి సెల్లార్ ఉంది. పిల్లల కోసం పక్కన కొంత స్థలం కొనవచ్చా?- సుందర ఆదిత్య, కరీంనగర్
మీ గృహం ఏ ముఖంతో ఉందో తెలుపలేదు. ఇంటికి సెల్లార్ ఉన్నప్పుడు పక్కన స్థలం కొనడం సమస్యగా మారుతుంది. ఇంటికి ఏ ముఖద్వారం ఉన్నా తూర్పు-ఉత్తరం స్థలాలు కొనవచ్చు. మీ ఇంటికి సెల్లార్ ఉంది కాబట్టి, తూర్పు స్థలం కొంటే, ‘తూర్పు స్థలం’ఎత్తవుతుంది. పడమర గొయ్యి ఉంటుంది. ఉత్తర స్థలం కొనాల్సి వస్తే దక్షిణం గొయ్యి అవుతుంది. పడమర, దక్షిణ దిశల్లోని స్థలాలు కొనడం నిషేధమన్న విషయం నిజమే అయినా, దక్షిణం స్థలాన్ని ఇతరుల పేరుతో కొని, ఇల్లు కట్టి అందులో నివసించాల్సి ఉంటుంది. సెల్లార్ ఉన్న ఇంటిని మీ పిల్లల పేరుమీదికి మార్చి పడమర స్థలంలో వేరుగా ఇల్లు కట్టుకోండి. ఏ ఇల్లు అయినా ప్రత్యేక కాంపౌండ్‌తో నిర్మించాలి కానీ, కలుపవద్దు.
పడకగదిలో తూర్పువైపు, నైరుతివైపు పిల్లర్లు ఉండొచ్చా? -బాలాంత్రపు సూర్య, జనగాం
చాలామంది ‘పైన ఇంటికి స్థలం కలిసి వస్తుంది కదా!’ అని దక్షిణం-పడమర అలాగే తూర్పు-ఉత్తరంలోని బాల్కనీల భాగాన్ని ఇంటి లోపలికి కలుపుతారు. బాల్కనీ అంచులకు ఇంటి గోడలు జరుపుతుంటారు. ఈ పద్ధతి ఇంటిలోని ఆవరణకు తీవ్ర నష్టం చేస్తుంది. తూర్పు బాల్కనీ కలుపుకొన్నప్పుడు ఆ భాగంలో ఉన్న పిల్లర్లు ఇంటి లోపలికి వస్తాయి. ఇలాంటి విధానం మంచిది కాదు. ఇంటి అవసరాలకు తగ్గట్టుగా ముందే గదుల వైశాల్యం పెంచుకొని ప్లాన్ చేసుకోవాలి. మీరు వెంటనే గోడలను పిల్లర్లకు సమానంగా కట్టుకోండి. తూర్పు, ఉత్తరం పిల్లర్లు ఇంటిలోకి రాకుండా జాగ్రత్త చేసుకోండి.
మా ఇంటికి పడమరన మురుగుకాలువ ఉంది. దానిని మూస్తే మంచిదేనా? అలా కాలువ ఉండవచ్చా?- వి.నాగశర్మ, గుమ్మడిదల
సాధారణంగా పల్లెల్లో మురుగు కాలువలు ఓపెన్‌గా ఉంటాయి. వాటిని మూసుకోవడం అన్ని విధాలుగా మంచిదే. ఇంటి అవసరాలకోసం తప్పనిసరిగా ‘డ్రైనేజి వ్యవస్థ’ ఎక్కడైనా అవసరమే. ఆయాప్రాంతాల వాటాన్ని బట్టి, రోడ్లను బట్టి దక్షిణం- ఉత్తర దిశల్లో కాలువలు వస్తాయి. మీరు ఆ కాలువ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఊరిలోని మురుగునంతా తీసుకెళ్లే పెద్దనాలా పక్కన ఇల్లు కట్టుకోవడం దోషం అవుతుంది. మీరు మీ ఇంటి పక్కనున్న మురుగుకాలువపై సిమెంట్ బిళ్లలు వేసి మూసేయవచ్చు. అలాగే మీ ఇంటి చుట్టూ చెట్లను పెంచుకోవడం వల్ల కలుషిత వాతావరణం కొంతవరకు శుద్ధి అవుతుంది.
మా ఉత్తరం గోడను ఆనుకొని హద్దుమీద పక్కవాళ్లు ఇల్లు కట్టారు. అది మాకు దోషమా? -సింగిరెడ్డి నిరంజన్, కొల్చారం
గోడలు, స్థలం కలిసి వస్తాయనే ఉద్దేశంతో ప్రహరీలు సంయుక్తంగా నిర్మించుకుంటారు. కానీ, ఇది సరికాదు. పొత్తుగోడలు పెట్టుకోవద్దు. ఉత్తరం వైపు గోడ మీ పొత్తులోనిది కానప్పుడు, మీదైన కాంపౌండ్‌ను మరొక దానిని నిర్మించుకోవాలి. పొత్తులోనిదే అయితే, ఆ ఇంటివారిని ఒప్పించి దానిని తొలగించండి. వాళ్ల కాంపౌండ్‌ను వాళ్లను కట్టుకోమని చెప్పండి. ప్రధాన గృహం చుట్టూ ప్రదక్షిణం లేకుండా నిర్మాణాలు ఎప్పుడూ చేయవద్దు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678