e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home వాస్తు వాస్తు:బాల్కనీలకు మొత్తం గ్రిల్స్‌ వేసుకోవచ్చా?

వాస్తు:బాల్కనీలకు మొత్తం గ్రిల్స్‌ వేసుకోవచ్చా?

బాల్కనీలకు మొత్తం గ్రిల్స్‌ వేసుకోవచ్చా? -కె.అరుంధతి, కొంపల్లి

రక్షణ అవసరమే కానీ, అన్నివైపుల నుంచీ బంధించుకొని ఇంటిని ‘జైలు’లా మార్చుకోవద్దు. మెట్లకు గ్రిల్స్‌ పెట్టుకోండి. ఇంటి చుట్టూ బాల్కనీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, వాటిని అలాగే ఉండనివ్వాలి. కింది ఇంటికి ప్రహరీ లోపల ఖాళీ స్థలం ఉంటుంది. అలాగని, ఆ ఖాళీ ప్రదేశానికి గ్రిల్స్‌ వేయం కదా! మీద కట్టిన ఇంటికి ఖాళీ ప్రదేశం బాల్కనీల వల్లనే ఏర్పడుతుంది. దాన్ని గ్రిల్స్‌తో బంధించవద్దు. దోషం అవుతుంది. అంతకుమించి, అలాంటి గృహంలో ఉండలేరు కూడా! తూర్పు-ఉత్తరం ఓపెన్‌గానే ఉంచండి. రక్షణ కోసం ఇంటి ద్వారాలకు గ్రిల్స్‌ డోర్లు పెట్టుకోండి. అంతగా కావాలనుకుంటే ‘కెమెరా’లు ఏర్పాటు చేసుకోవచ్చు.

- Advertisement -

ఇంటి మీద సెంటర్‌లో ‘సెల్‌టవర్‌’ పెట్టొచ్చా?-కొప్పెర నాగరాజు, జగిత్యాల
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చాలామంది సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని సాంకేతికతను పక్కనపెడితే, సెల్‌టవర్‌ ఏర్పాటు వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మంచి అద్దె వస్తుందని ‘సెల్‌ టవర్‌’కు పైనుండే స్థలం బాడుగకు ఇస్తున్నారు. ఆదాయం మాట దేవుడెరుగు, ఇంటి సెంటర్‌ (నాభిస్థానం)లో టవర్‌ ఏర్పాటు చేయవద్దు. టవర్‌ పడిపోకుండా ‘గ్రిప్‌ వైర్‌లు’ రావడం కోసం స్లాబ్‌ మీద ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్మిస్తున్నారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదు. టవర్స్‌ను ఇంటి మీద కాకుండా, స్థలం అందుబాటులో ఉంటే.. ఇంటికి నైరుతి భాగంలో ‘ఒంటి స్తంభం’ వేసుకొని దానిపై ఏర్పాటు చేసుకోవడం మంచిది. మన ఇల్లు ప్రకృతి సంబంధంగా విశ్వాకాశంతో ముడిపడి ఉంటుంది. టవర్‌ సాంకేతికత వేరు. దాన్ని నెత్తిన పెట్టుకోవడం కన్నా.. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది.

టెర్రస్‌ మీద పడమరలో గోపురంతో గుడి కట్టుకోవచ్చా?- ఆకుల చంద్రకళ, ఖమ్మం
ఇంటి మీద కోవెల కూడా నిర్మించవచ్చు. భగవంతుడి స్థానం అంతటా ఉంటుంది. అయితే, గోపురంతో గొప్పగా కట్టుకోవాలంటే చాలా నిర్మాణ మెలకువలు పాటించాలి. నిత్య నైవేద్యాలు, పూజలు, అర్చనలు శాస్ర్తోక్తంగా కొనసాగేలా పూజారిని పెట్టి చేయించగలిగితేనే గుడి కట్టండి. గోపురంతో కట్టినా, సాధారణంగా కట్టినా అది మీ ఇంటి పూజగదిగానే పరిగణించాల్సి ఉంటుంది. విశాలంగా కట్టాలని ఉంటే, పడమర మధ్యలో తూర్పు ముఖంగా పూజామందిరం కట్టుకోండి. చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా హాలు వేయండి. ఇంటి మీద ఒక ఫ్లోర్‌ అంతా పూజగదిగా చేసుకున్నప్పుడు, దానిపైన వాటర్‌ట్యాంక్‌ నైరుతిలో నిర్మించండి. ఇంటి మీద దేవుడి మంటపం వేసినపుడు ఆ మందిరం స్లాబు బీములు కిందికి (గదిలో కనిపించేలా కాకుండా) రాకుండా పైకి (స్లాబ్‌ కిందికి ఉండి, బీములు పైకి) ఉండేలా వేసుకోండి. గొప్పగా కట్టుకోవడం కన్నా.. గొప్పగా చూసుకోవడం ముఖ్యమని గమనించండి.

కింద ఇల్లు కట్టుకొని, పైన ఇద్దరు బిడ్డలకు పోర్షన్లు కట్టించి ఇవ్వొచ్చా?-వి.రాజు, ఇబ్రహీంపట్నం
కొడుకులే వారసులుగా ఉండాలని లేదుగా! కొందరు, అల్లుళ్లుగా వచ్చినా కొడుకుల్లా కలిసిపోగలరు. కొందరు, కొడుకులై పుట్టినా శత్రువులుగా మారవచ్చు. జీవితం కర్మానుగతం. మీరు కిందిభాగంలో అన్ని వసతులతో ఇల్లు కట్టుకోండి. పై అంతస్తులో బిడ్డలకు ఇల్లు కట్టవద్దు అనేదేమీ లేదు. మీ ప్లాను చూశాను. ఎవరికి వారు సొంత మెట్లు వేసుకోవాల్సిన పన్లేదు. రెండు పోర్షన్లు కట్టినప్పుడు, రెండు వైపులా మెట్లు అవసరం లేదు. పైగా స్థలం వృథా. ఆగ్నేయంలో కానీ, వాయవ్యంలో కానీ మెట్లు వేసుకొని రెండు పోర్షన్లవాళ్లూ వెళ్లే విధంగా బాల్కనీ ఏర్పాటు చేసుకోండి. బాల్కనీలు ఆక్రమించి ఇల్లు కట్టొద్దు. ‘ఇంటిని ఏ విధంగా విభాగం చేయాలి?’ అని కూడా అడిగారు మీరు. ఎవరి ఇంటి స్థలమైనా సమంగా ఉండేలా పోర్షన్లు చేయండి. మీరు చూపినట్టుగా
పోర్షన్లను ‘ఎల్‌’ ఆకారంలో కట్టవద్దు. స్లాబు భాగాన్ని రెండుగా చేసి కట్టండి. ఎలాగూ ‘బీములు’ వస్తాయి ‘ఫాల్స్‌ సీలింగ్‌’ చేసుకోండి. దోషం ఉండదు.

ఇంట్లో మాస్టర్‌ బెడ్‌రూమ్‌ ఎత్తు తప్పకుండా పెంచాలా?-భారతి, వైరా
ఇంటి లోపలి ఆవరణలో కొన్ని గదుల ఎత్తు పెంచి, కొన్ని పల్లంగా ఉంచడమనేది ఈ మధ్యకాలంలో వచ్చిన అలవాటు. అలా, ఇంట్లో ఫ్లోరింగ్‌ను మార్చడం వల్ల అద్భుతాల మాట అటుంచితే, అనేక అవస్థలు పడుతారు. ఇంటికి వచ్చిన అతిథులు అవగాహనలేక కిందపడిపోయే ప్రమాదమూ ఉంది. ఇంటి ఫ్లోరింగ్‌ సమంగానే ఉండాలి. ఒకప్పుడు నీళ్లతో రోజూ శుద్ధి చేసేవారు. నేడు తుడవడమే గగనం. పైగా ఫ్లోరింగ్‌లో పలు రకాల టైల్స్‌, మార్బుల్స్‌, గ్రానైట్‌ వాడుతున్నారు. కాబట్టి నైరుతి ఎత్తుగా, ఈశాన్యం పల్లంగా ఉండాలని ఇంట్లో స్టెప్పులు స్టెప్పులుగా ఫ్లోరింగ్‌ వేసుకోవద్దు. సమానంగా వేసుకోవచ్చు. లేదంటే, స్లోపు తక్కువ గ్రేడింగ్‌తో చేసుకోవచ్చు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana