e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home బతుకమ్మ వాస్తు:ఇంటి లోపల ‘ఎల్‌- ఆకారం’లో మెట్లు కట్టొచ్చా?

వాస్తు:ఇంటి లోపల ‘ఎల్‌- ఆకారం’లో మెట్లు కట్టొచ్చా?

ఇంటి లోపల ‘ఎల్‌- ఆకారం’లో మెట్లు కట్టొచ్చా? ఏ దిక్కున వేస్తే బాగుంటుంది?-బి. వసుంధర, మోత్కూర్‌

సాధారణంగా ఎల్‌-ఆకారంలో మెట్లను ఇంటి బయట అయినా, లోపల అయినా కట్టుకోవచ్చు. ఇంట్లో కట్టాలంటే పై అంతస్తుకు వెళ్లడానికి గదిలో దక్షిణం గోడ లేదా పశ్చిమంలో ఉన్న గోడ ఆసరాగా కట్టుకోవాలి. మెట్లు ఎప్పుడైనా సరే తూర్పు నుంచి పశ్చిమం వైపు ముఖం పెట్టి ఎక్కేలా వేసుకోవాలి. అలానే ఉత్తరం నుంచి దక్షిణం వైపు ముఖం పెట్టి ఎక్కే విధంగా దక్షిణం గోడను ఆనుకొని మెట్లు కట్టుకోవచ్చు. అయితే మెట్లను ఎప్పుడూ కూడా విరుద్ధ దిశల్లో అంటే పశ్చిమం నుంచి తూర్పునకు, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ఎక్కేలా వేయకూడదు. ఆ అపసవ్య దిశవల్ల శుభ దశలు వికృతంగా మారతాయి.

- Advertisement -

మూడు అంతస్తుల ఇల్లు కట్టుకోవచ్చా? అది ఒక్కరి పేరుమీదే ఉండొచ్చా? వి.రంగా, దేవరకద్ర

ఎవరు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. ఇంటి నిర్మాణ ప్రణాళికను బట్టి, మన అవసరాలను బట్టి కట్టుకోవడం దోషం కాదు. గదులు అయినా, అంతస్తులు అయినా మనిషి అవసరాలే ప్రధానం. కొన్నిచోట్ల చట్టం కూడా గ్రౌండ్‌తో కలుపుకొని రెండు అంతస్తులకే అనుమతి ఇస్తుంది. అలాంటప్పుడు మూడు అంతస్తులే వస్తాయి. ఇక ఇంటిని ఎవరి పేరుమీదనైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఒక్కరి మీదనే రాసి ఉండాలని ఏమీ లేదు. అన్నదమ్ములు ఒక్కో అంతస్తును ఒక్కొక్కరి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. దోషం లేదు.

ఇంటి ప్రహరీ గేటును ఆర్చిలా పెట్టవచ్చా? -ఆదె సీతామహాలక్ష్మి, కోరుట్ల
కొంతమంది ఇంటి గేటును గొప్పగా చూపించుకోవడానికి గేటు మీద పెద్ద ఆర్చిని కట్టి, భారీగా తయారుచేస్తారు. తద్వారా ఆ గేటు నిర్మాణం ప్రహరీ కంటే ఎత్తు పెరిగిపోతుంది. అయితే అలాంటి భారీ ఆర్చిగేట్లను తూర్పు, ఈశాన్యం, ఉత్తరం గేట్లుగా నిర్మించకూడదు. పశ్చిమ సింహద్వారం ఉన్న ఇంటికి, పశ్చిమ ప్రహరీకి ఆర్చి పెట్టుకోవచ్చు. అలానే దక్షిణం ప్రధానంగా ఉన్న ఇంటికి దక్షిణం, ఆగ్నేయ దిశల్లో ఆర్చిగేటును కట్టుకోవచ్చు. అయితే అలాంటి ఆర్చిలకు సమానంగా నైరుతి దిక్కులో గ్రిల్స్‌తోగానీ, దిమ్మెలతోగానీ ఎత్తు నియమాన్ని పాటించాలి. అప్పుడు ప్రహరీలు బ్యాలెన్స్‌గా ఉంటాయి.

స్థలంలో పుట్ట ఉంది. దానిని తీసి ఇల్లు కట్టొచ్చా?-రేగుల నరేందర్‌, జీడికల్‌

ఇంటి నిర్మాణ స్థలంలో పుట్ట ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అందులో చెదలు ఉంటాయి. అందరూ పుట్టలను పాములు కట్టుకొంటాయని అనుకుంటారు. కానీ, పాములు చెదల కోసం వాటిలోకి వెళ్తాయి. ఆ కన్నాలలో ఉంటాయి. క్రమంగా పుట్టలను ఆక్రమించుకుంటాయి. అంతేకానీ కట్టవు. పుట్టను తొలగించి, ఆ పుట్ట రంధ్రాలను మూసి, చదును చేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. అయితే ప్రతీ నిర్మాణం ప్రకృతి నిర్మాణం. కాబట్టి మనం దేనినైనా తొలగించే ముందు అవి ఇతర జీవుల నిర్మాణాలు కాబట్టి ముందు ‘ఉద్వాసన పూజ’ చేయాలి. ఆ తర్వాతే వాటిని తొలగించాలి. ‘మాకు చోటు ఇచ్చి, మీరు మరోచోటు చూసుకోండి’ అని జీవులను గౌరవంగా సాగనంపే ప్రక్రియ ఇది.

పశ్చిమం మెట్ల కింద స్టోర్‌ గది కట్టొచ్చా? – నాగుల శివ, ఉప్పల్‌

తూర్పు మెట్ల కింద, పశ్చిమం మెట్ల కింద ఇతరత్రా గదులు కట్టడం వల్ల అవసరాలు తీరడం అటుంచితే… అనవసరంగా, ఇంటి ఎత్తుకంటే చిన్నగదులు అవడంతో వృథాగా మిగిలిపోతాయి. కలుషిత వాతావరణం ఏర్పడుతుంది. చాలామంది, వాడని వస్తువులను వేయడానికి ఏదో ఒక మూల స్టోర్‌ గదిని కట్టి చెత్తా చెదారంతో నింపేస్తారు. ప్రతీది అందులో నిల్వ ఉంచేస్తారు. ఆ గదులను ఓపట్టాన తెరవక పోవడంతో, వాటిలోని వస్తువులు సద్వినియోగం కావు. ఎంతో ఖర్చుపెట్టి కొన్నవికూడా నిష్ప్రయోజనంగా మారిపోతాయి. అందువల్ల, మెట్ల కింద గదులు కట్టొద్దని అంటారు. గది వైశాల్యం, ఎత్తు, వెడల్పును బట్టి దానిలో వాతావరణం ఏర్పడుతుంది. చిన్నగదుల్లో, అదీ మెట్ల కింది గదుల్లో వెంటిలేషన్‌కు అవకాశం ఉండదు. కాబట్టి, స్టోర్‌ గదిని మెట్ల కింద కట్టొద్దు. ఈ విషయంలో పునరా లోచన చేయడం మంచిది.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement