e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ts welfare schemes రహదారుల మెరుగుతో తెలంగాణలో ప్రగతిబాటలు

రహదారుల మెరుగుతో తెలంగాణలో ప్రగతిబాటలు

రహదారుల మెరుగుతో తెలంగాణలో ప్రగతిబాటలు

మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. రవాణా సౌకర్యం బాగున్న సమాజాలు త్వరితగతిన పురోగమిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ అన్నిరంగాల్లో  మాదిరిగానే రహదారుల విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం, వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్ అండ్ బి రోడ్లలో 70 శాతం సింగిల్ లేన్ రోడ్లే. పంచాయతీరాజ్ పరిధిలో ఎక్కువ శాతం మట్టిరోడ్లే. అన్నిరోడ్లు కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోకుండా గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా మారేవి. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన రహదారులు నరకాలకు నకళ్లుగా ఉండేవి. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం మొదటి రోజుల్లోనే గ్రహించింది. రహదారుల పరిస్థితిని మెరుగు పర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత  ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్ – ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఆర్‌ అండ్‌ బి శాఖ పరిధిలోని 7,554 కిలోమీటర్ల స్టేట్‌ రోడ్‌ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లను విడుదల చేశారు. ఇందులో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పూర్తయింది. వీటికోసం రూ.7,463 కోట్లను ఖర్చు చేశారు. రోడ్లను బాగు చేసేందుకు 1868 కోట్లను ఖర్చు చేశారు. మంజీర ,గోదావరి, మానేరు,ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి,తుంగభద్ర తదితర నదులపై వంతెనలను నిర్మిస్తున్నారు. ఇందులో రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనల నిర్మాణాలను చేపట్టారు. 16 నిర్మాణాలను పూర్తి చేశారు. బడ్జెట్లో కూడా ఈ శాఖకు నిదులు భారీగానే కేటాయిస్తున్నారు. 2018-19లో బడ్జెట్లో రూ. 5,575 కోట్లు, 2019-20 లో రూ.2,219 కోట్లు, 2020-21 లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించారు.

 1. అన్ని మండల కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్డు

రాష్ట్ర రాజధాని నుంచి ప్రతీ జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా ఫోర్ లేన్ రోడ్డు, జిల్లాకేంద్రం నుంచి మండలకేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు, ప్రతీ మండలకేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి పక్కారోడ్డు సౌకర్యం ఉండాలనే విధానం పెట్టుకుని, దానిప్రకారం రహదారులను మంజూరు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బిటి రోడ్డు లేదు. రూ.2,518 కోట్ల వ్యయం చేసి, మండల కేంద్రాలకున్న 1,875 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను ప్రభుత్వం డబుల్ లేన్ రోడ్లుగా మార్చింది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూరింది. మండల కేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా బస్సు పోయే విధంగా రహదారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసింది. మట్టి రోడ్లను కూడా బీటీ రోడ్ల స్థాయిలో నిర్మించింది.

 • రవాణా శాఖ సేవలన్నీ ఆన్ లైన్ లోనే…

రవాణా శాఖ తీసుకొచ్చిన కొన్ని ఆన్ లైన్ సేవలు దళారుల వ్యవస్థను చాలావరకు నిరోధించగలిగాయి. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ జిల్లాలోని ఆర్టీఎ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసే ప్రక్రియ విజయవంతమైంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్, కొత్త పర్మిట్లు, పాత పర్మిట్ల పునరుద్ధరణ ట్రేడ్ సర్టిఫికెట్లు, ఫ్యాన్సీ నెంబర్లు వంటి మొత్తం 33 సేవలను ఆన్ లైన్ లో అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దళారులు, అవినీతి నిర్మూలన లక్ష్యంగా పారదర్శక పాలన అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణను రూపొందిస్తున్నది. 

డ్రైవింగ్ లైసెన్స్లో చిరునామాతో పాటు మరో 9 సేవలు పొందటానికి కొత్త యాప్

డ్రైవింగ్ లైసెన్సులో పేరు, చిరునామా మార్పు చేసుకోవాలంటె రవాణాశాఖలో చాలా పెద్ద ప్రక్రియ ఉండేది. ఈ విధానానికి స్వస్తి చెప్పి ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. టీ-యా్‌ప-ఫోలియో మొబైల్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యి.. కొత్త చిరునామా వివరాలు నమోదు చేసి, నిర్ణీత ఫీజు చెల్లిస్తే చాలు. అవసరం మేరకు మొబైల్‌ ఫోన్‌ నుంచే తాజా ఫొటోను, డిజిటల్‌ సంతకాన్ని అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. రవాణా శాఖకు వెళ్లకుండానే.. అడ్రస్‌ మార్పుతో కొత్త డ్రైవింగ్‌ లైసెన్సు ఇంటికి వచ్చేస్తుంది. ఇలాంటివి మరో 9 సేవలు మొబైల్‌ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయం వల్ల.. వాహనదారులపైన, అధికారులు, సిబ్బందిపైనా భారం తగ్గుతుంది.

మొబైల్ యాప్ లో అందుబాటులోకి వచ్చిన సేవలు

డూప్లికేట్‌ లెర్నర్స్‌ లైసెన్స్‌

డూప్లికేట్‌ లైసెన్స్‌

డ్రైవింగ్‌ లైసెన్సు బ్యాడ్జి(రవాణా వాహనాల కోసం)

స్మార్ట్‌ కార్డు(పాత పీవీసీ కార్డు లైసెన్స్‌ స్థానంలో కొత్తది తీసుకోవడం)

లైసెన్స్‌ హిస్టరీ షీట్‌

డైవ్రింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ (రెన్యూవల్‌)

డైవ్రింగ్‌ లైసెన్స్‌లో చిరునామా మార్పు

ప్రమాదకర లైసెన్స్‌ను ఆమోదించడం

గడువు ముగిసిన లెర్నర్స్‌ లైసెన్స్‌ స్థానంలో.. కొత్త లెర్నర్స్‌ లైసెన్స్‌ తీసుకోవడం.. వాహన తరగతిని చేర్చడం

గడువు ముగిసిన డైవ్రింగ్‌ లైసెన్స్‌లకు లెర్నర్స్‌ లైసెన్స్‌ జారీ

 • రికార్డుస్థాయిలో వంతెనల నిర్మాణం

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్ని వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రహదారులు, పంచాయతీ రాజ్ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్.అండ్.బి పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఆర్.ఓ.బీలను నిర్మించింది.

 • గోదావరి, ప్రాణహిత నదుల వెంట ప్రత్యేక రహదారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా గోదావరి, ప్రాణహిత నదుల వెంట మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకుంది. ఈ రహదారి నిర్మాణం అవసరాన్ని నొక్కి చెప్పి, కేంద్రం నుంచి కూడా ఈ రహదారి నిర్మాణానికి తనవంతు ఆర్థిక మద్దతు అందించేలా ఒప్పించింది. రూ.546.96 కోట్ల వ్యయంతో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు దాదాపు 350 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మిస్తున్నది. గోదావరి, ప్రాణహిత వెంట నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని అటవీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

 • గణనీయంగా జాతీయ రహదారుల విస్తరణ

సమైక్య పాలనలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి తెలంగాణలో కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. 2014 జూన్ 2 నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే, తెలంగాణ రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవను చూపింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ అవసరాన్ని కేంద్రానికి చెప్పింది. కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి,

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, ఇపుడు అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్ వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

 • ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో 24, 495 కిలోమీటర్ల రహదారులున్నాయి. 2,552 కిలోమీటర్ల స్టేట్ హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు, అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చలేకపోయాయి.

ఈ  పరిస్థితిని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో ఆర్ఓబీలతోపాటు పెద్దఎత్తున వంతెనల నిర్మానాలు కూడా చేపట్టింది. రూ.7,029 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది. 16,864 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చుతున్నారు. 9,731 కిలోమీటర్ల రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా,259 వంతెనల నిర్మాణం పూర్తయింది.

 • పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో 67,714 కిలోమీటర్ల పంచాయతీ రాజ్ రహదారులున్నాయి. ఇందులో 31,144 కిలోమీటర్ల రహదారులు మట్టి, మొరం రోడ్లు. 13,103 కిలో మీటర్లు కంకర రోడ్లు. మిగతా 23,467 కిలోమీటర్లు బీటీ రోడ్లయినా అవన్నీ అధ్వాన్న స్థితిలో ఉండేవి. మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతోపాటు, అద్వాన్నంగా ఉన్న బీటీ రోడ్లను మొరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014 నుంచి జనవరి 2019 నాటికి పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 9,807 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 10 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా జనవరి 2019 నాటికి  8,042 కిలోమీటర్ల పని పూర్తయింది. 15,958 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమత్తులు చేపట్టగా, 14,583 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. 511 వంతెన నిర్మాణం చేపట్టగా జనవరి 2019 నాటికి 312 వంతెనలు పూర్తయ్యాయి. 199 వంతెనల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయి. ఈ వంతెనల వద్ద నీటి నిల్వలకు వీలుగా 312 చెక్ డ్యాములు నిర్మించారు. మరో 1235 చెక్ డ్యాములు నిర్మించాల్సి ఉంది. 346 బ్రిడ్జిల పని పూర్తయింది. మిగిలిన రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నది. రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2020-21 బడ్జెట్లో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు కేటాయించారు.

కేంద్ర రహదారుల నిధి కింద తెలంగాణకు రూ.800 కోట్లు

కేంద్ర రహదారుల నిధి (సీఆర్డీ) పథకంలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు కేంద్రం రూ.800 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 668 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదిత 53 రోడ్లను విస్తరించేందుకు, మండల కేంద్రాలకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారు.

రూ. 3310 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పెండింగ్ పనుల పూర్తి

హైదరాబాద్ కు మణిహారంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో మిగిలిపోయిన పనులను రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,309.71 కోట్లతో పూర్తిచేసింది.

 • వరంగల్ కు ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు 74 కి.మీ. నిడివితో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రింగ్ రోడ్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 20న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 669 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ ఓఆర్ఆర్ కు అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ నిధులను ప్రభుత్వం 2017 అక్టోబర్ 9న విడుదల చస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రింగ్ రోడ్ నిర్మాణానికి మొత్తం అంచనా వ్యయం రూ.1445 కోట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఒకవైపు నుంచి ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓఆర్ఆర్ పనులు చేయనున్నారు.

 • తెలంగాణ రూరల్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు

తెలంగాణలోని హైవేలు, ప్రధాన రహదారులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు కూడా బాగుపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే తెలంగాణ రూరల్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, మరమ్మత్తులు, నిర్మాణం కోసం రూ. 5,000 కోట్లు,   గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ పరిధిలో ఉన్న 20 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయడానికి రూ. 200 కోట్లు, వచ్చే రెండేళ్లలో బి.టి.రోడ్ల మరమ్మత్తుకు రూ. 2400 కోట్లు  కేటాయించారు.  రూ. 700 కోట్ల పాత బకాయిలు చెల్లించేందుకు,  4,146 కిలోమీటర్ల డబ్ల్యుబీఎమ్‌ రోడ్లను మరమ్మత్తు చేయడానికి రూ. 1450 కోట్లు కేటాయించారు. 

 1. వాగులు, వంకలు, రైల్వేలైన్లపై బ్రిడ్జిలు

రహదారులపై నిర్మించే వంతెనల వద్ద చెక్ డ్యాములను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రోడ్లపై రూ.1,974 కోట్లతో 389 బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో చెక్ డ్యాముల అంచనా ఖర్చు 20 శాతం పెరిగి  రూ.2,200 కోట్లు కానున్నది. రోడ్డుకు అడ్డంగా ఉండే చిన్నవాగులు, వంకలపై ఈ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. చెక్ డ్యాములను కూడా నిర్మిస్తే నీటి నిల్వలు పెరిగి ఉపరితల నీటిమట్టం పెరుగుతుంది.

 1. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణం

హైదరాబాద్‌ – కరీంనగర్‌ల మధ్య నేరుగా రైలు నడపాలని 4 జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. కేసీఆర్ కరీనంగర్ ఎంపిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్-హైదరాబాద్ కు రెగ్యులర్ రైళ్లు నడవడం కోసం కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి అప్పటి యుపిఏ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కానీ ఆ తర్వాత పనులు ప్రారంభం కాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైల్వే లైను నిర్మాణం కోసం మళ్ళీ కేంద్రంపై వత్తిడి తెచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైను పనులు ప్రారంభించడానికి అంగీకరించింది. మనోహరాబాద్‌ – కొత్తపల్లి రైల్వే లైను పనులకు ప్రధాని నరేంద్రమోడీ 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. రూ.1,160 కోట్ల అంచనా వ్యయంతో 151 కిలోమీటర్ల మేర ఈ లైను నిర్మిస్తున్నారు. 2017-18 కేంద్ర బడ్జెట్లో ఈ పనులకు రూ.350 కోట్లు, 2018-19 బడ్జెట్లో ఈ పనులకు రూ.250 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ.60 కోట్లు విడుదల చేసింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు రైల్వే లైను ఉంది. అటు కరీంనగర్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైను ఉంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు లైను నిర్మిస్తే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు లైను అందుబాటులోకి వస్తుంది. ఈ రూట్లో నాచారం, ఇరనగరం, గజ్వేల్, కొడకండ్ల, లక్డారం, దుద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది, చిన్న లింగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వెదిర లో స్టేషన్లు నిర్మిస్తున్నారు.

కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలకు ఈ లైను వల్ల రైలు ప్రయాణానికి అవకాశం కలుగుతుంది. కరీంనగర్ నుంచి గ్రానైట్, సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి, వేములవాడ దేవాలయానికి భక్తులు వచ్చిపోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు ఎగుమతి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

ట్రయల్ రన్ నిర్వహణ : మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యాయి. 26 ఆగస్టు, 2020న  మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గంలో ఖాళీ రైలుతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులకు అయ్యే వ్యయంలో మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.

 1. ముఖ్యమంత్రి కార్యాలయం – ప్రగతిభవన్ నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం, కార్యాలయం కోసం హైదరాబాద్ బేగంపేటలో ప్రగతి భవన్ నిర్మించారు. రోడ్లు, భవనాలశాఖ ప్రధాన కార్యాలయం సర్కిల్ పరిధిలో ఆర్కిటెక్ట్  హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవన్ నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ అండ్ కంపెనీ వారు చేపట్టారు. ప్రగతిభవన్ నిర్మాణాన్ని 2016 మార్చిలో చేపట్టి 2017 నవంబర్ లో పూర్తి చేశారు. 9 ఎకరాల్లో నిర్మించిన ప్రగతి భవన్ నిర్మాణ పనులకు మొత్తం రూ.రూ.43.20 కోట్లు  ఖర్చు చేశారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, వివిధ పథకాలపై సమీక్షలు జరిపేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు అంశాలపై చర్చించేందుకు, ప్రజలతో సమావేశమయ్యేందుకు వీలుగా ప్రగతి భవన్ ను అన్ని సౌకర్యాలతో నిర్మించారు. 24 నవంబర్ 2016 గురువారం ఉదయం 5 గంటల 22 నిమిషాలకు నూతనంగా నిర్మించిన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు సుదర్శన యాగం నిర్వహించి గృహ ప్రవేశం చేశారు.

 • కొత్త సచివాలయంలో మూడు (మందిరం, మసీదు, చర్చి) ప్రార్థనా మందిరాలు

కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని ప్రార్థనా  మందిరాలకు శంకుస్థాపన చేయనున్నారు. 05 సెప్టెంబర్, 2020న ప్రార్థనామందిరాల నిర్మా ణం, ఇతర అంశాలపై మత పెద్దలతో సీఎం కేసీఆర్‌ జరిపిన సమావేశంలో వారినుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముస్లింల కోసం ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్‌ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు (మొత్తం 1500 చదరపు అడుగులు ) నిర్మిస్తారు. హిందువుల కోసం 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేవాలయాన్ని నిర్మించి దేవాదాయ శాఖకు అప్పగిస్తారు. కొత్త సెక్రటేరియట్‌ ప్రాంగణంలో తమకూ ప్రార్థనామందిరం కావాలన్న క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చిని కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 1. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదన

రాష్ట్రంలో కొత్తగా ఏడు చోట్ల విమాన రాకపోకల కోసం విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బేగంపేట, హకీంపేట, దుండిగల్ విమానాశ్రయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వరంగల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున సాగర్, పెద్దపల్లి, జక్రాన్ పల్లి (నిజామాబాద్), ఆదిలాబాద్, అడ్డాకుల (మహబూబ్ నగర్), కొత్తగూడెంలో ఎయిర్ స్ట్రిప్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి భూ సేకరణ జరపాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై నివేదిక అందజేస్తారు. దాని ఆధారంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి. అధ్యయనంలో అధికారుల బృందం వరంగల్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలో ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించి, నివేదిక తయారుచేసింది. 

 1. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు

ఎక్కడి నియోజక వర్గ ప్రజా ప్రతినిధి అక్కడే ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ప్రజల సందర్శన సమయంలో విశాలమైన నివాసాలను నిర్మించాలనే ప్రభుత్వ యోచన ప్రజలనుంచి మన్ననలను అందుకున్నది. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్నది. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమవడానికి అవకాశం కలుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం పెడుతుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ, ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించి, ఎమ్మెల్యేలకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం. ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో 104 క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం మొదటి అంతస్తులో మీటింగు హాల్, ఎమ్మెల్యే కార్యాలయం, వీఐపీలాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, పీఏ, పీఎస్‌లకు ప్రత్యేక గదులు, రిసెప్షన్, భద్రతా అధికారులకు గదులు వుంటాయి. రెండవ అంతస్తులో మాస్టర్ బెడ్‌రూం, పిల్లల బెడ్‌రూం, డైనింగ్ కం లివింగ్ స్టోర్స్, టాయ్‌లెట్లు, సిట్‌అవుట్, పూజగది వుంటాయి. మొత్తం రెండు అంతస్తుల్లో ఈ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

 1. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆఫీసులకు స్థలాలు

రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్నిరాజకీయ పార్టీలకు రూ.100లకు గజం చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని 27 జులై, 2018న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ కార్యాలయాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టీఆర్‌ఎస్ పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలాల కేటాయించారు.

 1. ఇళ్లకు డిజిటల్ డోర్ నెంబర్లు 

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ క్యూఆర్కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబర్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్‌‌‌‌ డోర్‌‌‌‌ నంబర్‌‌‌‌ను మున్సిపల్‌‌‌‌ శాఖ కేటాయించనుంది. ఇందులో నగరం/పట్టణం పేరు తెలిపే కోడ్‌‌‌‌, వార్డు/డివిజన్‌‌‌‌ తెలిపే మరో కోడ్‌‌‌‌, స్థానిక కాలనీని తెలిపే ఇంకో కోడ్‌‌‌‌ ఉంటాయి. ఈ మూడు కోడ్స్‌‌‌‌ తర్వాత ప్రతి ఇంటికీ ప్రత్యేక డోర్‌‌‌‌ నంబర్‌‌‌‌ కేటాయిస్తారు. పైలట్‌‌‌‌ ప్రాజెక్టుగా సూర్యాపేట మున్సిపాల్టీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రవాణాశాఖ చాట్ బాట్ కు అవార్డు

రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో రూపొందించిన రవాణాశాఖ చాట్ బాట్ కు ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఈ చాట్ బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వినియోగదారులు, వాహనదారుల సందేహాలను నివృత్తి చేస్తున్నందుకుగానూ ఈ అవార్డు లభించింది. 26 ఆగస్టు, 2020న ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన డిజిటల్  సభలో ఈ పురస్కారం లభించింది.

ఆర్ అండ్ బి రహదారులు నాలుగు లేన్ల రోడ్లు

2013-14    : 669 కిలోమీటర్లు

2019-20   : 1,029 కిలోమీటర్లు

(పెరుగుదల 360 కి.మీ., పెరిగిన శాతం 53.81)

రెండు లేన్ల రోడ్లు

2013-14    : 6,093 కిలోమీటర్లు

2019-20   : 13,273 కిలోమీటర్లు

(పెరుగుదల 7,180 కి.మీ., పెరిగిన శాతం 117.84)

సింగిల్ లేన్ రోడ్లు

2013-14    : 17,483 కిలోమీటర్లు

2019-20   : 13,785 కిలోమీటర్లు

(తగ్గుదల 3,698 కి.మీ.)

(పెద్ద మొత్తంలో సింగిల్ లేన్ రోడ్లను డబుల్, ఫోర్ లేన్ రోడ్లుగా మార్చడం వల్ల రాష్ట్రంలో సింగిల్ లేన్ రోడ్ల పొడవు తగ్గింది)

వంతెనలు

2013-14    : 2,893

2019-20   : 3,323

(పెరుగుదల 430, పెరిగిన శాతం 14.86)

నిధుల వినియోగం

2009 నుంచి 2014 వరకు : రూ.5,600 కోట్లు

2014 నుంచి 2020 : రూ.16,824 కోట్లు

(పెరుగుదల రూ.11,224 కోట్లు)

పంచాయతీ రాజ్ రోడ్లు

మొత్తం రోడ్ల పొడవు

2013-14    : 64,044 కిలోమీటర్లు

2019-20   : 69,844 కిలో మీటర్లు

(పెరుగుదల 5,800 కి.మీ., పెరిగిన శాతం 9)

వంతెనలు

2013-14    : 2,425

2019-20   : 2,971

(పెరుగుదల 546, పెరిగిన శాతం 22.51)

ఖర్చు

2004 నుంచి 2014 వరకు        : రూ.3,666.90 కోట్లు

2014 నుంచి 2020 వరకు        : రూ.6,949.98 కోట్లు

(పెరుగుదల రూ.3,283.08 కోట్లు)

(2014 నుంచి 2020 వరకు ఆర్ అండ్ బి శాఖకు బదిలీ అయిన పంచాయతీరాజ్ రోడ్లు 6,833.39 కిలో మీటర్లు. 2014 నుండి 2020 వరకు పూర్తి చేసిన రోడ్లు 8,189 కి.మీ.(కొత్తవి), 14,428 కి.మీ. (రెన్యూవల్స్)

 రెసిడెన్షియల్ స్కూళ్లు

మొత్తం గురుకులాలు

2013-14    : 298

2020-21   : 970

(పెరుగుదల 672, పెరిగిన శాతం 225.50)

ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లు

2013-14 :  134

2020-21 :  238

(పెరుగుదల 104, పెరిగిన శాతం 77.61)

ఎస్సీ డిగ్రీ కాలేజీలు :

2013-14 : 0

2020-21 :  30

ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు :

2013-14 : 96

2020-21 :  158

(పెరుగుదల 62 , పెరిగిన శాతం 64.58 )

ఎస్టీ డిగ్రీ కాలేజీలు :

2013-14 : 0

2020-21 :  22     

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు :

2013-14 :  12

2020-21 :  204

(పెరుగుదల 192 , పెరిగిన శాతం 1,600)

బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు :

2013-14 :   19

2020-21 :  280

(పెరుగుదల 261 , పెరిగిన శాతం 1,373.68 )

బీసీ డిగ్రీ కాలేజీలు :

2013-14 : 0

2020-21 :   1

జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు :

2013-14 : 37

2020-21 :   –

( ఎస్సీ 268 + ఎస్టీ 180 + మైనార్టీ 204 +బీసీ 281 + జనరల్ 37 =  మొత్తం 970 )

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రహదారుల మెరుగుతో తెలంగాణలో ప్రగతిబాటలు

ట్రెండింగ్‌

Advertisement