బొహోల్: సాధారణంగా పాము కనిపిస్తే చాలు మనం ఆమడ దూరం పారిపోతాం. ఇక పాము మనవైపే దూసుకొస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి ఏకంగా ఆ పాము మన నెత్తిపైనే కరెంటు తీగలకు వేలాడుతూ కనిపిస్తే.. ప్రాణం అరిచేతిలో పెట్టుకుని పక్కకు పరుగుతీసినా మన గుండె దడదడలాడుతుంది. ఫిలిప్పీన్స్‌లోని బొహోల్ ప్రావిన్స్ తగ్బిలారన్ సిటీలో ఇటీవల అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఈ నెల 12న తగ్బిలారన్ సిటీ బరాంగే ఏరియాలోని ఓ మార్కెట్ జనం రద్దీతో కిక్కిరిసిపోయింది. అదే సమయంలో మార్కెట్‌పైన ఉన్న కరెంటు తీగలకు ఒక పాము చుట్టుకుని ఉండటాన్ని కొందరు గమనించారు. అంతే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. జనం ప్రాణాలు చేతబట్టుకుని తలోదిక్కు పరుగులు తీశారు. జనం పరుగులు చూసి పాము కూడా కంగారు పడిందో ఏమోగానీ జారీపోయి కింద పార్కు చేసి ఉన్న బైకులపై పడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. వైరల్ హాగ్ పేరుతో ఉన్న యూ ట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తీగల పైనుంచి కిందపడిన అనంతరం పామును బంధించి సీమపంలోని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఈ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.