హైదరాబాద్: వింతవింత ఆహార పదార్థాల కలయికతో వంటలపై ప్రయోగాలు చేయాలంటే కొంచెం గుండె ధైర్యం కావాల్సిందే. ఏండ్ల కొద్దీ ప్రపంచంలో వలసలు పెరిగిపోతున్నాయి. ఒక ప్రాంతం ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడుతున్నారు. దాంతో మిశ్రిత సంస్కృతి సంప్రదాయాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వంటల్లో కూడా మిశ్రిత వంటకాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తకొత్త వేష భాషలేగాక, కొత్తకొత్త వంట విధానాలు కూడా పుట్టుకొస్తున్నాయి.
ఇప్పుడు బటర్ చికెన్ గోల్గప్ప అనే కొత్త రకం చాట్ గురించి ట్విట్టర్లో చర్చ మొదలైంది. పంజాబీ గ్రేవీ చికెన్ కర్రీ, పానీపూరిల మిశ్రమమే ఈ బటర్ చికెన్ గోల్గప్ప. మీరు ఇప్పటికే చాకొలేట్ గోల్గప్ప, మీఠా గోల్గప్ప, ఆఖరికి ఫైర్ గోల్గప్పను కూడా ట్రై చేసి ఉండవచ్చు. కానీ ఈ బటర్ చికెన్ గోల్గప్ప వాటికంటే కూడా ఒకింత భిన్నమైన చాట్. డెల్వినా అనే ట్విట్టర్ యూజర్ ఈ సరికొత్త చాట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
పంజాబ్ ప్రజలు వండుకునే ఒక క్లాసిక్ చికెన్ కర్రీ, వీధుల్లో లభించే ఒక పాపులర్ స్నాక్ మిశ్రమమే ఈ బటర్ చికెన్ గోల్గప్ప. గోల్గప్ప స్నాక్‌లో బఠానాకు బదులుగా బటర్ చికెన్ కూరితే అది బటర్ చికెన్ గోల్గప్ప అవుతుంది. అయితే డెల్వినా చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. ఈ మిశ్రమం వల్ల ఆ రెండు పదార్థాలకు విడివిడిగా ఉండే రుచి నాశనమైపోతందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
జీవితంలో ఇలాంటి ప్రయోగాలు అస్సలే చేయకూడదు అని ఇంకొందరు నెటిజన్లు పేర్కొన్నారు. కానీ, ఓ ట్విట్టర్ యూజర్ మాత్రం ఈ కాంబినేషన్‌ను ట్రై చేయొచ్చు అన్నారు. గోల్గప్పకు బటర్ చికెన్ కలుపడంవల్ల టేస్ట్ బాగా ఉంటుండవచ్చని ఓ ట్విట్టర్ యూజర్ అభిప్రాయపడ్డాడు. ఇదిలావుంటే బటర్ చికెన్ కలిసింది ఏదైనా తాను ఇష్టంగా తింటానని, కొన్ని నెలల క్రితం బటర్ చికెన్ ఆమ్లెట్ కూడా తిన్నానని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. మరి.. ఈ వెరైటీ చాట్‌ను టేస్ట్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..?