న్యూఢిల్లీ : యాభై దాటగానే వయసైపోయిందని నైరాశ్యంలో కూరుకుపోయేవారికి వయసు కేవలం అంకె మాత్రమేనని ఓ వృద్ధ జంట నిరూపించింది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు వయసు మీద పడటం అడ్డంకి కానే కాదని ప్రపంచానికి ఆ జంట చాటింది. ఓ స్పానిష్ పాటకు అనుగుణంగా డ్యాన్సులతో వృద్ధ దంపతులు అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రెడ్ స్కల్జ్ అనే యూజర్ ట్విటర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వృద్ధ జంట బాల్ రూమ్ స్టైల్ డ్యాన్స్ తో ఊపేయడం నెటిజన్లను కట్టిపడేసింది. వీరు ఎప్పటినుంచో డ్యాన్స్ లో ఆరితేరిన ప్రొఫెషనల్ డ్యాన్సర్లను తలపిస్తూ ఇప్పటికీ డ్యాన్స్ పై పట్టు కోల్పోదనే రీతిలో వారి మూమెంట్స్ కనిపించాయి. మే 7న ఈ వీడియో ట్విటర్ కు ఎక్కగా ఇప్పటివరకూ 6,04,200 వ్యూస్ వచ్చాయి. వృద్ధ జంట డ్యాన్స్ మూవ్ మెంట్స్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. వయసు వీరికి కేవలం అంకె మాత్రమేనని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, వీడియోలో వృద్ధుడు దివంగత మార్వెల్ ఫ్రాంచైజీ ఫిల్మ్ మేకర్ స్టాన్లీని తలపించారని మరో యూజర్ పేర్కొన్నారు.