హైదరాబాద్: సాధారణంగా కుక్క చెవులు ఎంత పొడవుంటాయి..? ఆరు ఏడు ఇంచులు, మహా అయితే మరో ఇంచు అటుఇటు. కానీ అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పెంచుకుంటున్న ఈ నల్లని వేటకుక్క చెవులు మాత్రం చాలా పొడవున్నాయి. ఎంత పొడవంటే ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేంత. నలుపు, కమిలిన వర్ణాల కలయికగా ఉన్న ఈ కుక్క చెవులు 13.38 ఇంచుల పొడవు ఉన్నాయి. అంటే సెంటీమీటర్లలో చూస్తే 34 సెంటీమీటర్లు అన్నమాట.
ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన వెటర్నరీ టెక్నీషియన్ పైగ్ ఓల్సెన్ అనే మహిళ దగ్గర ఈ పొడవు చెవుల వేటకుక్క ఉన్నది. మూడేండ్ల వయసున్న ఈ కుక్కను పైగ్ ఓల్సెన్ ముద్దుగా లౌ అని పిలుచుకుంటుంది. ఇటీవల కరోనా లాక్డౌన్ సమయంలో ఓల్సెన్ తన కుక్క పొడవైన చెవులను కొలిచి ఆశ్చర్యపోయింది. సాధరణంగా నలుపు, కమిలిన వర్ణాల కలయికతో ఉండే అన్ని వేటకుక్కల చెవులు పొడవుగా, అందంగా ఉంటాయని.. అయితే వాటిలోనే కొన్ని కుక్కల చెవులు మాత్రం అసాధారణంగా ఇంకా ఎక్కువ పొడవు ఉంటాయని ఓల్సెన్ చెప్పింది.
ఇక, తన కుక్క పొడవైన చెవులు దాని ముక్కు చివరి వరకు ఉంటాయని పైగ్ ఓల్సెన్ వెల్లడించింది. అయితే ఈ పొడవైన చెవుల కారణంగా తన కుక్కకు ఇంతవరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని ఆమె తెలిపింది. పైగా పొడవు చెవుల కారణంగానే అది డాగ్ కాంపిటీషన్స్‌లో, డాగ్ షోలలో పాపులర్ అయ్యిందని చెప్పింది. అంతేగాక అమెరికన్ కెన్నెల్ క్లబ్, ర్యాలీ ఒబీడియెన్స్లో టైటిళ్లను కూడా నెగ్గిందని ఓల్సెన్ పేర్కొన్నది.
కాగా, తన కుక్క చెవులను చూస్తే ఎవరికైనా టచ్ చేసి చూడబుద్దవుతుందని, మొదటి చూపులోనే లౌ పై మనసు పారేసుకుంటారని పైగ్ ఓల్సెన్ చెప్పింది. తన స్నేహితులతో కలిసి వైన్యార్డులకు వెళ్లినప్పుడు వైన్‌ను టేస్ట్ చేయడంలో లౌ కంపెనీ కూడా ఇస్తుందని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్సైట్లో ఓల్సెన్ పేర్కొన్నది. లౌ లోని ప్రత్యేక లక్షణమే ఇప్పుడు దానికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ 2022 బుక్‌లో చోటుదక్కేలా చేసిందని ఆమె తెలిపింది.