శుక్రవారం 27 నవంబర్ 2020
Tourism - Apr 12, 2020 , 17:55:15

తెలంగాణ ఊటీ ‘గొట్టం గుట్ట’

తెలంగాణ ఊటీ ‘గొట్టం గుట్ట’

 ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక జీవనంతో సతమతమవుతున్నవారు.. ఒక్కసారి తెలంగాణ ఊటీకి వెళితే చాలు ఉన్న టెన్షనంతా మరచిపోతారు. ప్రకృతి రమణీయత ఇంత అందంగా ఉంటుందా అంటూ తమను తాము మైమరచిపోతారు. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న తెలంగాణ ఊటీ గురించి తెలుసుకుందామా?

అంతులేని ప్రకృతి సౌందర్యం సొంతం చేసుకున్న ’గొట్టం గుట్ట’ తెలంగాణ ఊటీగా ప్రాచుర్యం పొందింది. ఎటు చూసినా పచ్చని అందాలే కనిపిస్తాయి. మనసును కట్టిపడేసే ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తాయి. గిరుల కురుల నుంచి జాలువారే వాగు పరవళ్లు అబ్బురపరుస్తాయి. అడవి గుండా సాగే ప్రయాణం అడుగడుగునా మధురానుభూతులు కలిగిస్తుంది.

హైదరాబాద్‌ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉండే గొట్టం గుట్ట గురించి చాలామందికి తెలియదు. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దులో ఉన్న ఈ సుందర ప్రదేశం ప్రకృతి సోయగాలకు నిలయం. గొట్టం గుట్ట చేరుకోవడానికి అడవుల గుండా సాగే ప్రయాణం ద్వారా పొందే అనుభూతి అంతా ఇంతా కాదు. మట్టిరోడ్డు జర్నీ, దారి పొడవునా పచ్చని చెట్లు.. ఇలా ప్రతిదీ పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. అడవితల్లి ఒడి చేరగానే తమను తాము మైమరచిపోతారు. పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లల్లాగా కేరింతలు కొడతారు.

మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టం గుట్ట పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది. ఇటు పర్యాటకం, అటు ఆధ్యాత్మికం.. రెండింటిని మిక్స్‌ చేసుకుంది గొట్టం గుట్ట. సువిశాలమైన అటవీ ప్రాంతం.. కొండల మధ్యలో నుంచి ప్రవహించే పెద్ద వాగు.. పురాతనమైన దేవాలయం పర్యాటకులకు కనువిందు చేస్తాయి.గొట్టం గుట్ట జర్నీలో భాగంగా.. జహీరాబాద్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే అద్భుత అందాలు ఆహ్వానం పలుకుతాయి. ఎటు చూసినా ప్రకృతి రమణీయత తప్ప మరో ప్రపంచం కనిపించదు. మార్గమధ్యంలో చించోలి అభయారణ్యంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు, శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవాని మాత గుడి కనిపిస్తాయి.

అలా అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే.. వంపులు తిరుగుతూ హోయలు పోతూ పరవళ్లు తొక్కే నదీ జలాలు ఆహ్వానం పలుకుతాయి. ఆ దృశ్యాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అక్కడే శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దేవస్థానం ఉంది.

శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతో పాటు జాతర నిర్వహిస్తారు. తెలంగాణ నుంచే కాదు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో దీన్ని రెండో శ్రీశైలంగా అభివర్ణిస్తారు.

ఎత్తైన కొండలు, లోతైన లోయలు.. ఎటుచూసినా పచ్చని చెట్లే దర్శనమిస్తాయి. కొండల నుంచి జలజలా పారే సేలయేరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. భూమిపై పచ్చని చీర పరచినట్లు ఉంటుంది ఇక్కడి ప్రకృతి సోయగం. గొట్టం గుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాడి మల్కాపూర్‌ జలపాతం కూడా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రతి శని, ఆదివారాలు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ప్రాంతానికి దిగువవైపు చంద్రగిరి డ్యామ్‌ ఉంది.

వీకెండ్‌ టూరుకు కరెక్ట్‌ ఎంపిక గొట్టం గుట్ట. యాంత్రిక జీవనంలో టైమ్‌ మిషన్‌ తో కుస్తీ పడుతున్నవారు.. ఇక్కడకు ఒక్కసారి వెళితే చాలు తమను తాము మైమరచిపోతారు. అద్భుతమైన అనుభూతులు సొంతం చేసుకుంటారు. ఇక్కడి ప్రాంతంలో సినిమా షూటింగులు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. 75 శాతం కర్ణాటక, 25 శాతం తెలంగాణ భూభాగం ఉన్న గొట్టం గుట్ట ప్రాంతం.. రెండు రాష్ర్టాల సరిహద్దు కావడంతో అభివృద్ది జరగడం లేదనే వాదనలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటే గనక రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందంటున్నారు స్థానికులు.

గొట్టం గుట్ట వెళ్లాలనుకుంటే అక్కడ ఉండటానికి వసతి సౌకర్యం లేదు. ఒక్కరోజులోనే రిటర్న్‌ కావాల్సిన పరిస్థితి. కానీ ఒక్కసారైనా చూసి తరించాల్సిన ప్రాంతం. పాపికొండలు తదితర పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్లుగా మౌలిక వసతులు కల్పిస్తే మంచి టూరిస్ట్‌ స్పాట్‌ గా గొట్టం గుట్టకు పర్యాటకులు క్యూ కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.