శుక్రవారం 29 మే 2020
Tourism - Mar 30, 2020 , 23:01:53

అందాల అధ్యాత్మిక మందిరం..మెదక్‌ చర్చి

అందాల అధ్యాత్మిక మందిరం..మెదక్‌ చర్చి

మెదక్‌ అనగానే మదిలో మెదిలేది చర్చి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి మెదక్‌ కెథడ్రల్‌ (సీఎస్‌ఐ) చర్చి . ఆధ్యాత్మిక సంస్కృతికి నిలయంగా ఈ చర్చి వెలుగొందుతున్నది. చర్చి ప్రధాన ప్రాంగణంలోకి అడుగుపెట్టి.. అలా తలపైకెత్తి చూస్తే అధ్భుతమైన కట్టడం కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. యూరపు గోతిక్‌ శైలీలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం కళాత్మక నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తున్నది. సుమారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న కరువును రూపుమాపేందుకు అప్పట్లో ఈ చర్చిని నిర్మించారన్న ప్రతీతి ఉంది. 

దేశ విదేశాలకు చెందిన వివిధ విభాగాలతో చర్చ్‌ నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చర్చి అంతర్భాగాంలో ఏసుక్రీసు జన్మవృత్తాంతం, పునురుత్పాదన, ఏసు శిలువ లాంటి జీవిత చరిత్రను ప్రస్పుటించే స్టెయిన్‌ గ్లాస్‌ ముక్కలతో నిర్మితమైన ఈ చర్చ్‌ కళాత్మక నిర్మాణానికి నెలవుగా మారిందనడంలో సందేహ ంలేదు. ఈ చర్చ్‌ను సందర్శించానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో నుంచే కాకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశీయులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. 


ప్రతి యేటా క్రీస్‌మస్‌ పర్వదినం భారీస్థాయిలో కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రజల సహకారంలో చర్చ్‌ దినదినాభివృద్ది చెందుతూ జిల్లాలోనే ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్నది. ముఖ్యంగా చర్చ్‌ ప్రాంగణంలో సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన గోల్‌బంగ్లా సినీ ప్రపంచానికి షూటింగ్‌ స్పాట్‌గా సేవలందిస్తున్నది. అత్యద్భుతమైన నిర్మాణశైలి దీని ప్రత్యేకత. ఇటలీకి చెందిన నిర్మాణ నిపుణులు, కళాకారులు చర్చి పనుల్లో పాల్గొన్నారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ చర్చికి 173 అడుగుల ఎత్తున్న శిఖరం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పిల్లర్లు లేకుండా రెండంతస్తులలో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. 

ఒకేసారి దాదాపు 5 వేల మంది కూర్చుని ప్రార్థనలు చేసుకునే విధంగా చర్చి నిర్మాణం జరిగింది. 1914 నుంచి 1924 వరకు పదేళ్లపాటు చర్చి నిర్మిణం కొనసాగింది. దాదాపు తొంబై సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడమే అయినా నేటికీ చెక్కుచెదరకుండా సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 
logo