శనివారం 28 నవంబర్ 2020
Tourism - Oct 31, 2020 , 16:45:27

సైబీరియా టూ వారణాసి

సైబీరియా టూ వారణాసి

వారణాసి : శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లోని విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు దేశంలోని నీటి వనరులు ఆతిథ్యమిస్తున్నాయి. చలికాలం ప్రారంభమైందంటే చాలు.. ప్రతి ఏటా వర్ణశోభితమైన పక్షులు దేశంలోని పలు నీటి వనరులు సోయగాల సరాగాలు ఆలపిస్తుంటాయి. కిలకిలారావాలతో ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేస్తుంటాయి. రంగురంగుల విహంగాలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది.. 

పురాతన నగరం వారణాసిలోని గంగా నదికి సైబీరియా కొంగలు ఈ ఏడాది వారం ముందుగానే వచ్చాయి. దీంతో ఘాట్లన్నీ వలస పక్షలుతో కిటకిటలాడుతున్నాయి. వేల కిలోమీటర్ల నుంచి గంగా నదికి వచ్చిన పక్షలు సుమారు నాలుగు నెలల పాటు ఇక్కడే ఉండనున్నాయి. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ రంజన్‌ గుప్తా మాట్లాడుతూ సాధారణంగా సైబీరియన్‌ పక్షులు నవంబర్‌ మొదటి వారంలో వస్తాయని, ఈ సంవత్సరం ముందుగానే వచ్చాయని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో తక్కువ వాహనాల రద్దీ కారణంగా.. కాలుష్యం తగ్గి పక్షుల రాకకు ఒక కారణం కావచ్చని చెప్పారు.

సైబీరియన్‌ పక్షుల రాక చాలా మంచి సంకేతమని బీహెచ్‌యూ జంతు విభాగానికి చెందిన జ్ఞానేశ్వర్‌ చౌబే అన్నారు. పక్షల వలస నమూనాలపై ప్రపంచ మహమ్మారి ప్రభావం చూపలేదని దీనికి అర్థమని పేర్కొన్నారు. కాగా, సైబీరియా కొంగల రాకపై స్థానికంగా బోట్లు నడుపుకునే కార్మికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పక్షులు ఘాట్ల వైపు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయని శంభు మాంజీ అనే వ్యక్తి చెప్పాడు. చాలా మంది విదేశీ పర్యాటకులు ఘాట్లపై గంటలకుపైగా గడపడంతో పాటు పక్షులను ఫొటోలు తీసుకుంటారని, గంగానదిలో షికారు చేస్తారని తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.