శనివారం 30 మే 2020
Tourism - Mar 18, 2020 , 17:35:31

ఫరీద్‌మియా ప్రేమకు ప్రతి రూపం మినీ తాజ్‌మహల్‌

ఫరీద్‌మియా ప్రేమకు ప్రతి రూపం మినీ తాజ్‌మహల్‌

 షాజాహాన్‌ తన ప్రేమకు ప్రతి రూపంగా ఆగ్రలో తాజ్‌మహల్‌ను నిర్మించినట్టే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేటలో ఫరీద్‌మియా అనే నిజాం వంశస్తుడు తన సతీమణి ఫరీదాబేగం జ్ఞాపకార్థం మినీ తాజ్‌మహల్‌ను నిర్మించారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడం అందరినీ ఆకర్షిస్తున్నది. కామారెడ్డి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్‌పేటకు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు. 

నిర్మాణం ఇలా..

నిజాం నవాబ్‌కు సామంతుడైన ఫరీద్‌మియా తన భార్యను ఎంతో ప్రేమించేవాడు ఆమె అకాల మరణం చెందడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. జ్ఞాపకాలను నెమరు వేసుకొనేందుకు ఫరీదా బేగం ప్రేమకు ప్రతిరూపంగా అపురూపమైన సమాధి నిర్మించాడు. సమాధిని అచ్చం తాజ్‌మహల్‌ లాగే తీర్చిదిద్దాలని సంకల్పించాడు. ఆ కట్టడం పూర్తికాక ముందే ఆయన కూడా మరణించాడు. దీంతో మినార్‌లను నిర్మించలేదని, తాను చనిపోతే తన సమాధి కూడా భార్యపక్కనే ఏర్పాటు చేయాలని చెప్పడంతో అలాగే నిర్మించారని గ్రామస్తులు చెబుతుంటారు. 

మినీ తాజ్‌మహల్‌తో పాటు ఇక్కడ ఉన్న గడికోటను గోల్కొండ సుల్తానుల కాలంలో నిర్మించారు. ఎంతో చరిత్ర ఉన్న గడికోట, మినీ తాజ్‌మహల్‌ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొన్నాయి. గడికోటలో నిజాం నవాబ్‌లు గుర్రాలను పెంచేవారని, మినీ తాజ్‌మహల్‌ నుంచి దోమకొండ, గంభీరావుపేట సంస్థానాలకు సొరంగమార్గాలు ఉండేవని పెద్దలు చెబుతారు. ఇటీవల కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వడంతో సొరంగ మార్గం ధ్వంసమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మినీ తాజ్‌మహల్‌తో పాటు గడికోటను ఆధునీకరిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. 


- ఘనంగా మొహరం వేడుకలు

ఫరీదాబీ పేరిట ప్రతి మొహరం నాడు హిందువులు, ముస్లిములు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నప్పటికీ సంస్థానం పరిధిలో ఉన్న 460 ఎకరాల భూమి ప్రస్తుతం అన్యాక్రాంతమై కబ్జాలకు గురవుతోందని గామస్తులు తెలిపారు. వీటి ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1 కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటలోని మినీ తాజ్‌మహల్‌ 

2ఫరీద్‌మియా, ఫరీదాబేగం సమాధులు

3 గడికోటలోని గుర్రాలను పెంచే స్థలం

4 గడీకోట ప్రధానద్వారం

5 మహల్‌ నుంచి ఉన్న సొరంగ మార్గంlogo