బుధవారం 03 జూన్ 2020
Tourism - Apr 17, 2020 , 15:12:37

ఇన్ టూ ద వైల్డ్.. మరో యువకుడిని కాపాడిన అధికారులు

ఇన్ టూ ద వైల్డ్.. మరో యువకుడిని కాపాడిన అధికారులు

హైదరాబాద్: మామూలుగా తీర్థయాత్రలకు బస్సు మాట్లాడుకుని వెళతారు చాలామంది. కానీ ఓ బస్సు, అదీ దిక్కుమాలిన అడవిలో పాడుబడి వదిలేసిన బస్సు పుణ్యతీర్థంలా మారింది. ఇన్ టూ ద వైల్డ్ పుస్తకం, సినిమా చాలా పాపులర్ అయ్యాయి. వాటిద్వారానే ఆ బస్సు ప్రపంచానికి తెలిసి వచ్చింది. క్రిస్టఫర్ మెక్‌కాండ్లెస్ అనే నవయువకుడు 1992లో అలాస్కా పచ్చదనంలోకి ఒంటరిగా వెళ్లిపోయి ఆ పాడుబడ్డ బస్సునే ఇల్లుగా చేసుకుని కొన్నాళ్లపాటు అక్కడే గడిపాడు. చివరికి వెనుకకు రాలేక.. తిండి దొరకక.. ఆకలికి అలమటించి ప్రాణాలు వదిలాడు. ఈ కథ చాలామంది హృదయానికి హత్తుకుంది. సినిమాగా కూడా హిట్టయింది. ఆ కథ అందించిన స్ఫూర్తితో దిక్కూదివాణం లేని ఆ అడవిలో పాడుబడిన ఆ బస్సులో గడపాలనుకుని ఎంతోమంది ఉత్సాహపడ్డారు. అదొక పుణ్యతీర్థంలా మారింది. కొందరు సాహసులు అక్కడిదాకా వెళ్లారు కూడా. కానీ వెనుకకు రావడానికి ఇబ్బందులు పడి చేతులెత్తేశారు. పోలీసులు లేదా సైన్యం సాయంతో మాత్రమే వారు తిరిగి ఇల్లు చేరగలిగారు. గమ్యం చేరుకోవాలంటే టెక్లానికా అనే ఓ నదిని దాటాలి. చుట్టుపక్కల ఎక్కడా జనావాసాలు ఉండవు. తినడానికి ఏమీ దొరకదు. అంతా వన్‌సైడ్ జర్నీలా ఉంటుంది. తాజాగా బ్రెజిల్‌కు చెందిన డియాస్ డాసిల్వా అనే యువకుడు బస్సు వద్దకు చేరుకున్నాడు. తెచ్చుకున్న తిండి అయిపోఇంది. వెనుకకు వెళదామంటే మంచు కరిగి నది పొంగుతున్నది. చేసేదేమీ లేక ఆ యువకుడు తన దగ్గరున్న బీకన్ పైర్ చేసాడు. దాంతో అధికారులు రంగంలోకి దిగి అతడిని కాపాడారు. గత ఫిబ్రవరిలో ఐదుగురు ఇటాలియన్లను కూడా ఇలాగే అధికారులు కాపాడాల్సి వచ్చింది. అప్పటికే అందులో ఒకరికి చలి వల్ల కాళ్లు పగుళ్లు వేశాయి. అందరూ ఇలా సురక్షితంగా వెనుకకు వచ్చే అదృష్టానికి నోచుకోరు. గత వేసవిలో బెలారుస్‌కు చెందిన ఓ యువతి తిరుగు ప్రయాణంలో టెక్లానికా నదిలో కొట్టుకుపోయింది. 2010లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళ కూడా అంతే.


logo