శుక్రవారం 30 అక్టోబర్ 2020
Tourism - Sep 22, 2020 , 18:57:25

కొంచెం ఆలస్యమైతే రెండు శాల్తీలు గల్లంతయ్యేవి!.. వీడియో

కొంచెం ఆలస్యమైతే రెండు శాల్తీలు గల్లంతయ్యేవి!.. వీడియో

వారికి భూమిపై నూకలు ఉండబట్టే.. అతి పెద్ద మంచుకొండ మీద పడినా తప్పించుకోగలిగారు. మంచుకొండను ఎక్కేందుకు ఇద్దరు అన్వేషకులు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా అది వారి మీదికే తిరిగి కుప్పకూలింది. అదృష్టంకొద్దీ వారు వెంట్రుకంత వాసిలో చావు నుంచి తప్పించుకున్నారు. లేనట్లయితే ఇద్దరి శాల్తీలు గల్లంతై ఉండేవే. 

వైరల్ అయిన వీడియోలోని అన్వేషకులలో ఒకరైన మైక్ హార్న్ 30 సంవత్సరాలుగా అన్వేషకుడిగా ఉన్నారు. అతను గ్రహం మీద పలు శీతల ప్రదేశాలలో దారుణమైన ట్రెక్కింగ్ నిర్వహించాడు. అయితే, అతడు ఇటీవల చేసిన ఒక ట్రెక్ తన జీవితాన్ని కొద్దిలో ముగించేదే. బాల్‌ బాల్ బచ్‌గయా అన్న చందంగా చావు తప్పి బయటికొచ్చారు. నార్వే- ఉత్తర ధ్రువం మధ్య ద్వీపసమూహమైన స్వాల్బార్డ్ చుట్టూ ప్రయాణించేటప్పుడు ఒక పెద్ద మంచుకొండను చూసిన హార్న్, అతడి సహచరుడు ఫ్రెడ్ రూక్స్ తమ పడవ నుంచి దూకి ఆ అతిపెద్ద మంచుకొండపైకి ట్రెక్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది వారు తమ సాధనాలను మంచుకొండకు జతచేసి స్పైక్డ్ బూట్లు, పోల్స్‌ సహాయంతో దాన్ని ఎక్కడం ప్రారంభించారు. కాసేపు అంతా బాగుంది అనిపించింది. అయితే అకస్మాత్తుగా ఆ అతి పెద్ద మంచుకొండ కూలిపోవటం మొదలైంది. మంచు కొండ పూర్తిగా కూలిపో్క ముందే హార్న్, రూక్స్ అదృష్టవశాత్తూ దాని పైనుంచి దూకేసి తప్పించుకోవడం ద్వారా చూర్ణం కాకుండా తప్పించుకున్నారు.

“మంచుకొండ పైకి ఎక్కే ముందు అల్పాహారం తినకూడదు. అదృష్టం కొద్దీ మేమిద్దరం బతికి బయటపడ్డాం. ఇలాంటివి పునరావృతం చేయను. మా యూట్యూబ్ ఛానెల్‌లో పూర్తి కథ చూడండి” అని హార్న్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ చేశాడు. “నేను ప్రపంచవ్యాప్తంగా గత 30 సంవత్సరాలుగా పలు తెలివితక్కువ పనులు చేస్తున్నాను. అయినప్పటికీ చాలా తక్కువ ప్రమాదాలు జరిగాయి. కాని, మేం సజీవంగా ఇంటికి రావడానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. ఆర్కిటిక్‌లో మా ముఖం మీద ఐస్ క్యూబ్స్ పడటం చూడటం కంటే మీ జిన్, టానిక్‌లో ఐస్ క్యూబ్స్‌ను చూడటం సురక్షితం”అని హార్న్ ఫ్రాన్స్ బ్లూతో అన్నారు.