సోమవారం 25 మే 2020
Tourism - Mar 20, 2020 , 12:36:31

పాండవుల విలాసం.. జలపాతాల ప్రదేశం..!

పాండవుల విలాసం.. జలపాతాల ప్రదేశం..!

పచ్చని చీరకట్టుతో అడవితల్లి! ఓ పక్క పక్షుల కిలకిలరావాలు! మరోపక్క జలజలపారే జలపాతపు హోయలు! కొండల్లో గంగమ్మ జాలువారుతుంటే కనువిందు చేసినట్లుంటుంది! ప్రకృతి తల్లి పురివిప్పి నాట్యమాడినట్లు కనిపిస్తుంది! ఇదంతా ఎక్కడో దూరతీరంలోని అరకు అందాల్లో.. ఉదక మండలంలోని సుందర దృశ్యాలు అనుకుంటే పొరబడినట్లే! వాటిని తలదన్నే రీతిలో మహబూబాబాద్‌ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న పాండవుల గుట్టలు! ఈ గుట్టల్లో ఏడు బావులు, జలపాతాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటు న్నాయి! ఈ జలపాతాల వెనుక పెద్ద కథనే ఉంది! వీటిని చూడాలంటే సాహసం చేయాల్సిందే!  

అది మహబూబాబాద్‌ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు. దట్టమైన అడవి ప్రాంతం. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మిర్యాల పెంటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండల పేర్లు పాండవుల గుట్టలుగా పేరుగాంచినవి. ఇక్కడ నివసించే గిరిపుత్రుల కథనంప్రకారం.. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కొంత కాలం ఈ కొండలపైన నివాసమున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ సమయంలోనే పాండవులు వారి అవసరాల కోసం ఈ కొండలపై బావులు నిర్మించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ గుట్టలపై వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఏడు బావులు కనువిందు చేస్తుంటాయి. ఒక బావి నుంచి మరొక బావిలోకి నీరు జలపాతంలా పడుతుంటే పాలధారలు అమాంతం మీద పడిన అనుభూతిని కలిగిస్తాయి. 

ఇలా వస్తున్న జలపాతాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి అంతుపట్టని రహస్యం. అసలు గుట్ట పైభాగంలో నీరు ఎలా వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని ప్రశ్న. మరొకటి ఏమిటంటే జలపాతంలా ఏడుబావుల నుంచి కిందికి వచ్చిన నీరు కాల్వ రూపంలో కొంత దూరం ప్రవహించి హఠాత్తుగా మాయమైపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇక్కడి గిరిజనుల్లో ఉన్న ప్రచారం మాత్రం అనుభూతిని కలిగిస్తుంది. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు కొండలపై ఏడు బావులు నిర్మించారని, వారి అవసరాల కోసం వాటిని ఉపయోగించుకొని, మిగితా నీటిని పాతాళగంగలోకి మళ్లించినట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. నీటి ఆనవాళ్లు బయటికి వెళ్లే పాండవుల సమాచారం బయటికి వ్యాపిస్తుందని అందుకే నీటిని పాతాళగంగలోకి మళ్లించారని గిరిజనులు వాదిస్తున్నారు. అందుకే ఈ కొండలను పాండవుల గుట్టలుగా పిలుస్తున్నట్లు చెబుతున్నారు.

పర్యాటక కేంద్రంగా 

పాండవుల గుట్టలోని ఏడు బావుల జలపాతాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడు జలపాతాలు బాహ్యప్రపంచానికి తెలిసింది. తద్వారా తెలంగాణ నలుమూలల నుండే కాకుండా మిగతా రాష్ర్టాల నుండి కూడా పర్యాటకులు వచ్చి అందమైన జలపాతాలను తిలకిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేసే పనిలో నిమగ్నమైంది. ఏడు జలపాతాల వరకు రహదారిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తుంది. ప్రభుత్వం పర్యాటకం పై దృష్టిసారిస్తే దేశంలోనే పర్యాటక కేంద్రంగా గుర్తింపు వస్తుంది. ఐదువందల మీటర్ల పొడవున్న ఈ ఏడు బావుల జలపాతాలు చూడటానికి కనుల పండువగా కనిపిస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తే విదేశీలు సైతం ఔరా అనకతప్పదు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా రూపుదిద్ధుకునే అవకాశం లేకపోలేదు.

అడవి జంతువులకు స్థావరం

పాండవుల గుట్ట అడవి జంతువులకు స్థావరంగా ఉంది. పెద్ద పులులు, చిరుతలు, దుప్పి, జింక, ఎలుగుబంట్లు తదితర అడవి జీవాలు ఇక్కడ నివసించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పాండవుల గుట్టల్లో పెద్ద పెద్ద గుహలు, సొరంగాలు, లోయలు ఉన్నాయి. పైగా దట్టమైన అడవి కావడంతో అడవి జంతువులకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. మహబూబాబాద్‌ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అటవి ప్రాంతానికి ఈ గుట్టలే కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవితో మనిషి దూరని విధంగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ జలపాతాల సుందరదృశ్యాలు చూడాలంటే సాహసోపేత్తమైన ప్రయాణం చేయాలి. గుట్టలను ఎక్కుతూ బండరాళ్ల అంచునా చేతి సపోర్టుతో ఎక్కాల్సి ఉంటుంది. ఒక వేళ్ల జారితే ప్రమాదం ఏవిధంగా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. logo