శనివారం 30 మే 2020
Tourism - Mar 17, 2020 , 11:43:50

ఆదిలాబాద్‌ జిల్లారా.. అది చక్కని అడవి మల్లెరా

 ఆదిలాబాద్‌ జిల్లారా.. అది చక్కని అడవి మల్లెరా

అందమైన అడవులతో కూడుకున్న జిల్లా అదిలాబాద్‌. ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో ఉన్న జలపాతాల అందాలు, వాటి సోయగాన్ని వర్ణించ అక్షరాలు చాలవంటే అతిశయోక్తి కాదు. సహ్యావూది పర్వతాల్లోంచి జాలువారే ఆ అందాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇప్పటివరకు ఆ జిల్లాలో ఉన్న ఒక్క ‘కుంటాల’ తప్ప  మరే జలపాతాలు పర్యాటక ప్రదేశాలుగా ప్రసిద్దికెక్కలేదు. కానీ అదే అడవుల్లో పొచ్చెర, మిట్టె, గుత్పల, కొరిటికల్‌, సమితులతో పాటు ఇక్కడి అటవీగర్భంలో దాగిన మరెన్నో సుందర జలపాతాలు పంచుతున్న మధురానుభూతులను మూటగట్టుకోవాలంటే ఓసారి వెళ్ళి రావాల్సిందే. 


 నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలాగే బోథ్‌ మండలంలోని పొచ్చెర జలపాతం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దగ్గరకు వెళ్లి చూస్తే ఆకాశ గంగే కిందకు దూకుతున్న భావన కలిగిస్తుంది. నేరడిగొండ నుంచి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో కుంటాల జలపాతం ఉంటే, బోథ్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఉంది. ఈ రెండు మండలాల్లోనే ఇంకా గాయత్రి, సవతులగుండం, కనకదుర్గ, బుంగనాల, గన్పూర్‌ జలపాతాలున్నాయి. ఈ ఏడింటినీ కలిపి ‘సప్తగుండాలు’గా వ్యవహరిస్తారు. వీటిని సందర్శించాలంటే గుట్టలు, వాగులు దాటాల్సి ఉంటుంది.


ఇక నేరడిగొండ నుంచి జాతీయ రహదారి మీదుగా నిర్మల్‌ వైపు కేవలం పది కిలోమీటర్లదూరం వెళ్లగానే రోడ్డుకు అతిసమీపంలో ఉండే కొరిటికల్‌ జలపాతం చెప్పనలవిగాని సొబగులతో కనువిందు చేస్తుంది. దీనికి ‘మినీ నయాగరా ’ అని పేరు. నేరడిగొండ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే గుత్పల జలపాతం కూడా సందర్శకులను కట్టిపడేస్తుంది. కానీ ఇక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి లేదు. ఇకపోతే సిర్పూర్‌(యూ) మండల కేంద్రం నుంచి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మిట్టె జలపాతం కూడా తన ఒంపుసొంపులతో పర్యాటకులను ఇటే కట్టిపడేస్తుంది.


ఆసిఫాబాద్‌ మండలం మొవాడ్‌ అటవీ ప్రాంతంలో మరో కనువిందు చేసే జలపాతం ఉంది. దీనిని ‘సమితుల గుండం’గా వ్యవహరిస్తారు. ఆసిఫాబాద్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోఉన్న ఈ జలపాతానికి చక్కని రోడ్డుసౌకర్యం ఉండడంతో దీనికి సందర్శకుల తాకిడి ఎక్కువే ! కడెం సమీపంలోని కడెం ప్రాజెక్టు కూడా మంచి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది.


సహ్యాద్రి పర్వతాల్లోంచి ప్రవహించే కడెం వాగుమధ్యలో పెద్దూర్‌ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. సాయంసంధ్య వేళ ఇక్కడ బోట్‌ షికారు ఒక మరువలేని మధురానుభూతి. దీనికి 12 కిలోమీటర్ల దూరంలోనే జన్నారం మండలంలో కవ్వాల్‌ అభయారణ్యముంది. ఇక్కడి జింకల సంరక్షణ కేంద్రం చూసి తీరాల్సిందే! నిర్మల్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని స్వర్ణ ప్రాజెక్టు.. తాచుపాములాగా మెలికలు తిరిగి కనిపించే నేరడిగొండ మండలంలోని మహబూబ్‌ ఘాట్‌ కూడా ప్రముఖ దర్శనీయ స్థలాలు. మొత్తంగా అదిలాబాద్‌ జిల్లాలోని ఈ జలపాతాలు ఓ మధురమైన అనుభూతిని పంచుతాయి.


logo