బుధవారం 27 జనవరి 2021
Tourism - Dec 22, 2020 , 02:38:24

కేంద్రం వెనక్కి తగ్గాలి

కేంద్రం వెనక్కి తగ్గాలి

  • ఎన్నారై హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు నర్సింహనాయుడు 

ఆర్మూర్‌: గల్ఫ్‌ కార్మికుల వేతనాన్ని  తగ్గిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్నారై హక్కుల సంక్షేమవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్‌చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఖతర్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, యూఏఈ దేశాల్లో వర్తించే విధంగా నెలసరి వేతనాన్ని 735 దిర్హమ్స్‌గా సిఫారసు చేసిందన్నారు. గతంలో ఈ మొత్తం 800 నుంచి 1700 దిర్హమ్స్‌గా ఉండేదని చెప్పారు. కువైట్‌, సౌదీలో 324 డాలర్లకు తగ్గిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌తో కొత్తగా ఆయా దేశాలకు వెళ్లే కార్మికులకు వేతనాలు తగ్గే ప్రమాదముందన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక దుబాయి అధ్యక్షుడు ఏముల రమేశ్‌, నేతలు అర్గుల్‌ సురేశ్‌, రమేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

ఉత్తర్వులను రద్దు చేయాలి..

గల్ఫ్‌దేశాలతో గతంలో భారతదేశం కుదుర్చుకొన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా చేసిన కనీస వేతన సిఫార్సులను తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్‌ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. దశాబ్దాలపాటు కార్మికులు, ప్రవాస కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేసి సాధించుకొన్న ఈ ఒప్పందాన్ని నీరుగార్చడం సరికాదు. ఇది కార్మికహక్కుల ఉల్లంఘనే.  ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదంటే ఉద్యమమే.

- మంద భీంరెడ్డి, 

ఇమ్మిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరంకార్పొరేట్లపైనే ప్రేమ

ఇప్పటికే విదేశీ కంపెనీలు, మన దేశంలోని మ్యాన్‌పవర్‌ రిక్రూట్‌మెంట్‌ కంపెనీలు, తక్కువ వేతనాలతో మన కార్మికుల రక్తం తాగుతున్నాయి. తాజా సిఫారసులతో గల్ఫ్‌లో ఉన్నవారిని తొలిగించి, తక్కువ వేతనంతో మరొకరిని పెట్టుకొనే యత్నాలు మొదలయ్యాయి. కార్పొరేట్లకు లాభంచేసే కేంద్రం నిర్ణయం అన్యాయం. 

- టీ ధర్మేందర్‌, ఖతర్‌ ప్రవాస

మిత్రమండలి కోశాధికారి ప్రవాస కార్మికుల పొట్టగొట్టింది

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ గల్ఫ్‌ కార్మికుల పొట్టగొట్టింది. కార్మికుల బతుకు అగమ్యగోచరంగా మారింది. కనీస వేతనాలను తగ్గించడం అత్యంత దారుణం. కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ కంపెనీలపై కేంద్రానికి ఉన్న ప్రేమ, పేదవారైన కార్మికులపై లేకపోవడం బాధాకరం. 

- చింతలతాన ప్రవీణ్‌, గల్ఫ్‌ తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడు, కువైట్logo