శనివారం 05 డిసెంబర్ 2020
Tourism - Jun 03, 2020 , 13:16:14

అడ్వెంచర్ స్పాట్.. బాబేఝరి లోయ!

అడ్వెంచర్ స్పాట్.. బాబేఝరి లోయ!

  • జలపాతం పరిసరాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్‌ క్లబ్‌ డైరెక్టర్‌ రంగారావు
  • సాహస క్రీడలకు అనుకూలమని అభిప్రాయం  
  • ఇప్పటికే వాటర్‌ రాఫెల్లింగ్‌, క్లైంబర్ ట్రెక్కింగ్‌ శిక్షణ
  • టూరిజం శాఖకు ప్రతిపాదనలు

ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం బాబేఝరి గ్రామ సమీపంలోని దట్టమైన అటవీప్రాంతం.. చుట్టూ ఎత్తైన కొండలు.. వానకాలంలో 200 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకే బాబేఝరి జలపాతం.. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ లోయ అడ్వెంచర్‌ స్పాట్‌ నిర్వహణకు అనుకూలమని సంబంధిత క్లబ్‌ అభిప్రాయ పడుతున్నది. ఈ మేరకు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు సాహస క్రీడలకు ఎంపిక చేయాలని టూరిజం శాఖను కోరుతున్నది. 


బాబేఝరి జలపాతం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాబేఝరి జలపాతం ఫొటోలు పంపించాలంటూ 2019 ఆగస్టులో జోడెఘాట్‌లోని కుమ్రం భీం మ్యూజియం ఉద్యోగి కుమ్రం బండేరావ్‌కు టూరిజం శాఖ సూచించింది. ఈ మేరకు అతడు అతికష్టం మీద లోయలోకి దిగి పై నుంచి కిందకు దూకే జలపాతం ఫొటోలు తీసి టూరిజం శాఖకు అందించాడు. ఈ ఫొటోలు పలు పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నివేదికలు పంపించారు.

లోయను సందర్శించిన డైరెక్టర్‌

ఈ యేడాది ఫిబ్రవరి 10న తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్‌ క్లబ్‌ డైరెక్టర్‌ రంగారావు, కెరమెరికి చెందిన అడ్వెంచర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ మడవి కన్నీబాయితో కలిసి జలపాతం సమీపంలోని లోయను సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు సాహస క్రీడలకు ఎంపిక చేయాలని కోరారు. 

మార్చి ఒకటిన శిక్షణ..

ఆదిలాబాద్‌ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో 2020 మార్చి ఒకటిన పారాసాయిలింగ్‌ క్యాంపు ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి వరల్డ్‌ కప్‌ వాటర్‌ రాఫెల్లింగ్‌ క్లైంబర్‌ ట్రెక్కింగ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌తో పాటు మంచిర్యాల జిల్లాలకు చెందిన సాహస క్రీడాకారులకు మౌంటైన్‌ క్లైంబర్‌ సాహస క్రీడా అంబాసిడర్‌ మడవి కన్నీబాయి, పీఎస్‌ఆర్జే ఆదిలాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌ అధ్యక్షుడు పేందోర్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. అడ్వెంచర్‌ క్లబ్‌ సభ్యులతో పాటు వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులు పాల్గొనడం విశేషం.

మొద‌టిసారి ఎవ‌రు వెలుగులోకి తెచ్చారంటే.. 

బాబేఝ‌రి జ‌ల‌పాతం బ‌హుషా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి ఎత్తైన‌ది కావచ్చు. సుమారు 500 ఫీట్ల‌కు పైగా ఎత్తు నుంచి నీటి ధార ప‌డ‌టం క‌మ‌నీయంగా క‌న‌ప‌డుతుంది. బాబేఝ‌రి జ‌ల‌పాతాన్ని మొట్ట‌మొద‌ట‌గా ఫోటోలు తీసి వెలుగులోకి తీసుకొచ్చింది సీనియ‌ర్ పాత్రికేయుడు ఎక్క‌ల్‌దేవి శ్రీ‌నివాస్. ప్ర‌స్తుతం న‌మ‌స్తే తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంఛార్జిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌‌ ఎక్క‌ల్‌దేవి శ్రీ‌నివాస్.‌. 2006 అక్టోబ‌ర్‌లో కెర‌మెరికి చెందిన చంద్ర‌కాంత్‌, చెన్న‌డు అనే ఇద్ద‌రు గిరిజ‌నుల స‌హ‌కారంతో ప్ర‌మాద‌భ‌రితంగా ఉన్న ఆ కొండ అంచుపైకి చేరుకుని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు అప్ప‌ట్లో ప‌త్రిక‌లో వ‌చ్చాయి. ఆ ఫోటోల‌ను ఆదిలాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ బుక్‌లెట్‌లోనూ ప్ర‌చురించింది. అప్ప‌ట్లోనే బాబేఝ‌రి జ‌ల‌పాతం విష‌యాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్రుష్టికి తీసుకెళ్ళారు.

బాబేఝరి లోయ సాహస క్రీడలకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతంలో రాక్‌ ైక్లెంబింగ్‌, వాటర్‌ రాఫెల్లింగ్‌వంటి సాహస క్రీడలు నిర్వహించ వచ్చు. అడ్వెంచర్‌ టూరిజంగా మార్చితే ఆదివాసీ యువతకు నైపుణ్యం ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. ఇక్కడి వారికి ఉపాధి కూడా దొరుకుతుంది. 

- మడవి కన్నీబాయి, బ్రాండ్‌ అంబాసిడర్‌, అడ్వెంచర్‌ టూరిజం