శనివారం 30 మే 2020
Tourism - Mar 28, 2020 , 16:04:58

జంతుప్రపంచంగా జన ప్రపంచం

జంతుప్రపంచంగా జన ప్రపంచం

కరోనా వ్యాధి భయానికి దేశంలోని జనమంతా ఇండ్లే జైళ్లుగా బతుకుతున్నారు. దాంతో ఇన్నాళ్లూ మనుషుల భయంతో ఎక్కడో దట్టమైన అడవుల్లో బతికిన వన్యప్రాణులు మళ్లీ తమ పొలిమేరలను పొడిగించుకుంటున్నాయి. ఈశాన్యరాష్ట్రం అసోంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

అసోంలోనే పెద్ద నగరమైన గువాహటీకి సమీపంలో దిఘానిపుఖురి అనే సరస్సు ఉంది. దాని చుట్టుపక్కల కొంతకాలంగా పర్యాటకరంగం పెరగటంతో ఎంతోకాలంగా అక్కడే నివసించిన చుక్కల జింకలు, పక్షులు, బాతులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించటంతో ఇప్పుడు జనం మొత్తం ఇండ్లకే పరిమితమయ్యారు. జనసంచారం పూర్తిగా ఆగిపోవటంతో ఏనాడో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిన చుక్కల జింకలు హఠాత్తుగా ఆ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాయి. ‘ఈ ప్రాంతంలో చుక్కల జింకలను చూడక దశాబ్దాలు గడిచిపోయిందని, ఈ నెల 24న  సరస్సు ఒడ్డున ఈ జంతువులు కనిపించటంతో ఆశ్చర్యపోయామని ఆ సరస్సు ఒడ్డునే నివాసం ఉంటున్న రజీబ్ ప్రకాశ్ బారువా అనే వ్యక్తి తెలిపారు. ఈ ప్రాంతంలో చుక్కల జింకలను తన చిన్నతనంలో చూశానని గుర్తుచేసుకున్నారు. సరస్సులో బోటింగ్ కూడా పూర్తిగా ఆపేస్తే ఒకప్పుడు సరస్సు నిండా ఉన్న బాతులు కూడా తిరిగి వస్తాయని  గ్రీన్ ఎన్జీవో అరన్యక్ కార్యకర్త బిబవ్ తాలుక్‌దార్ ఆశాభావం వ్యక్తంచేశారు. గువాహటి చుట్టుపక్కల ఒకప్పుడు 200 రకాల వణ్యప్రాణులు ఉండేవని తెలిపారు.


logo